జీవమిచ్చే వాక్యానికి “తెరువబడుము”
యెషయ 35:4-7a; యాకోబు 2:1-5; మార్కు 7:31-37 (B 23)
“ఈ రోజు నిత్య కన్యక జన్మించిది... దేవుని తల్లిగా ఆమె తన రంగస్థల పాత్రకు
సిద్ధమైంది" (DO)
ఈ నాటి సువిశేషo ద్వారా చెవుడు గల నత్తి
వానికి కలిగిన వైద్యం (మార్కు 7:32) గురించి మనల్ని ధ్యానo
చేయమంటుంది తల్లి శ్రీసభ. యేసు అతనిని జనసమూహం నుండి దూరంగా తీసుకెళ్లి, ఆ వ్యక్తి చెవుల్లో వ్రేళ్ళు పెట్టి, అతని నాలుకను తాకి, స్వర్గం
వైపు చూస్తూ నిట్టూర్పువిడచి “ఎఫ్ఫతా” అని అరమాయిక
భాషలో అన్నాడు. దీని అర్ధం “తెరువబడుము”. వెంటనే అతని చెవులు తెరవబడ్డాయి, అతని నాలుక విడుదలైంది. అతను స్పష్టంగా మాట్లాడాడ గలిగాడు
(వ. 33-35). ఈ అరమాయిక పదం “ఎఫ్ఫతా” అన్నది ఆదిమ సంఘ రోజుల నుండి మన కాలం వరకు జ్ఞానస్నాన సంస్కార ఆచారంలో భాగమైంది. జ్ఞానస్నాన సమయంలో గురువు, శిశువు చెవులు మరియు నోటిని తాకుతూ, "ప్రభువైన యేసు చెవిటివారు వినేలా మరియు మూగవారు మాట్లాడేలా
చేసాడు. ఆయన తన మాటను అంగీకరించడానికి నీ చెవులను మరియు తండ్రియైన దేవుని
స్తోత్రానికి మరియు మహిమకు తన విశ్వాసాన్ని ప్రకటించడానికి మీ నోరును త్వరలో
ముట్టుకుంటాడు” అని ప్రార్ధిస్తాడు.
యేసు తన వేళ్లను మనిషి చెవుల్లో పెట్టడం యొక్క ప్రాముఖ్యత
ఏమిటి? గ్రెగొరీ ది గ్రేట్ ఇలా అంటాడు, “ఆత్మను దేవుని వ్రేళ్ళు అంటారు. ప్రభువు చెవిటి-మూగ చెవులలో
తన వేళ్లను ఉంచినప్పుడు, అతను పరిశుద్ధాత్మ బహుమతుల ద్వారా మనిషి యొక్క ఆత్మను
విశ్వాసానికి తెరతీస్తున్నాడు”. యేసు
చెవిటి వ్యక్తిని జనసమూహం నుండి ఎందుకు దూరంగా తీసుకెళ్లాడు? దేవుని వాక్యానికి చెవిటితనం నుండి స్వస్థత పొందాలంటే, చుట్టూ ఉన్న సమూహాల నుండి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే యేసు స్వస్థత అన్నది ఒకరి స్వంత హృదయంలో
జరుగుతుంది. మన చెవులు దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఇది చేయడానికి మనం అపసవ్య
గుంపు నుండి దూరంగా ఉండాలి. మనం కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా మౌన ధ్యానంలో
గడపాలి. ప్రభువు మనతో ఏమి చెబుతున్నాడన్న దానిపై మనం దృష్టి పెట్టాలి.
మార్కు సువార్తికుడు తన సువార్తను తొలి క్రైస్తవ హింసాకాండ
కాలంలో రాశాడు. అటువంటి పరిస్థితిలో క్రీస్తు కొరకు మాట్లాడటం, సాక్ష్య మివ్వడం
అన్నది అతి ప్రమాదకరమైన విషయం. ప్రభువు సాక్ష్యం రక్త ప్రాణాలను కోరింది. మార్కు
చెప్పే చెవిటి-మూగవాని అద్భుత కథ యేసుకు సాక్ష్యమివ్వలేని అతని సంఘంలోని సభ్యులను
లక్ష్యంగా చేసుకున్నదని మనకు స్పష్ట మవుతుంది. ఆయనను గూర్చి మాట్లాడడంలో వారికి
వాగ్ధాటి ఉన్నప్పటికీ వారు యేసు మాటలకు చెవిటి-మూగ వారయ్యారు. అలాగునే చెవిటి-మూగ మరియు యేసు అనుచరుల మధ్య ఇదే సమాంతరత మనకు
కన్పిస్తుంది. చెవిటి-మూగుడు సరిగా వినలేడు, మాట్లాడలేడు.
అలాగునే యేసు మాట వినలేని పలుక లేని శిష్యుల్లోకూడా తమ సాక్ష్యానికి అడ్డంకిని
పెంచుకుంటారు. వారికి ధైర్య వైద్యం కావాలి. అలాంటి స్వస్థత మాత్రమె యేసుకు
సాక్ష్యం ఇవ్వడంలో అడ్డంకులను తొలగిస్తుంది.
యేసు సందేశానికి సాక్ష్యం ఇవ్వడంలో మనకు ఎలాంటి అవరోధం
వుంది? విశ్వాసులుగా, సంఘముగా మనం స్వస్థత కోసం యేసు దగ్గరకు
రావాలి. ఈ స్వస్థత కేవలం బలి పూజా వేడుకలోనే జరగవచ్చు. వైద్యం అన్నది శారీరకంగా, మానసికంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అందరికి
వైద్యం ఎల్లప్పుడూ అవసరం. మచ్చుకు... మనల్ని మనం తగ్గించుకునే సందర్భాలు ఉన్నాయి.
ప్రభువు ప్రేమించే వ్యక్తి పట్ల కొన్నిసార్లు మనం ప్రతికూలంగా ప్రవర్తిస్తూవుంటాము.
అప్పుడు మనతో మనం సంతోషంగా ఉండలేము. అది మనకు నిజంగా అవసరమా? ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ మన అవగాహనకు
మించినవి. "ఎఫ్ఫతా” అంటే “తెరువబడుము". మనం ఇతరులకు స్వస్థతా వాహనాలుగా
ఉండాలని యేసు మనలనుండి కోరుకుంటున్నాడు. దానికి తగినట్లుగా మనము ఆతనితో వుంటే ఆతను
మనల్ని స్వస్థపరుస్తాడు.
“సృష్టికర్తకు దైవిక నివాస స్థలంగా ఒక కొత్త జీవి
సిద్ధమైంది” (DO)