AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday 14 September 2024

యేసు నా రక్షకుడు యెషయా 50:5-9a; యాకోబు 2:14-18; మార్కు 8:27-35 (B 24)

 

యేసు నా రక్షకుడు

యెషయా 50:5-9a; యాకోబు 2:14-18; మార్కు 8:27-35 (B 24)

దుఃఖపు ఖడ్గం ఆమె నిర్దోషి హృదయాన్ని దూసుకెళ్ళిoది (DO)

 

నేటి సువార్త పఠనం మార్కు సువార్తకు కేంద్ర బిందువుగా వుంది. యేసును ఒక పరమ వైద్యుడుగానూ, అద్భుత కార్యకర్తగానూ చూపిస్తూ, తన సర్వోన్నత అధికారాన్ని ప్రతిబింబింప చేస్తుంది మార్కు సువార్త. మార్కు చూపించే యేసు శైలి పరిసయ్యులను గందరగోళంలో పడవేసింది. యేసు కార్యకలాపాలలోని అర్థం అనేకుల విరుద్ధమైన వివరణలకు దారితీసింది. అందుకే యేసు తన శిష్యులను “నన్ను ఎవరని మీరు భావించుచున్నారు?అని అడిగాడు. దేవుని కృపను పొందుకున్నవాడై, “నీవు నిజంగా "దేవుని క్రీస్తువు" - "సజీవుడైన దేవుని కుమారుడవు" (మార్కు 16:16) అని పేతురు యేసుకు సమాధానం ఇచ్చాడు. గ్రీకు పదం "క్రిస్టోస్" లేదా హీబ్రూలో "మెస్సీయ" అంటే "అభిషిక్తుడు" – దిగజారిపోయిన మానవ జాతిని విమోచించడానికి పంపబడిన వాడు (లూకా 9:20, అపో. 2:14-36) అన్న అర్ధాన్ని చూపిస్తుంది.

ప్రజలు తనను గురించి ఏమని భావిస్తున్నారో, ఎలా నిర్వచిస్తున్నారో, ఏవిధమైన స్పష్టతను కలిగి ఉన్నారో అని తెలుసుకోవడానికి యేసు బహుశ: కోరుకొని ఉండవచ్చు. అందుకే ఇటువంటి ప్రశ్న శిష్యులను అడిగాడు యేసు. బాప్తిస్త యోహాను, "రాబోయేది నువ్వేనా లేక మేము మరొకరి కోసం వేచి వుండాలా"? అని అడిగినప్పుడు (మత్త 11:3; లూకా 7:19) యేసు సూటిగా సమాధానం చెప్పలేదు కానీ తన స్వస్థత సంకేతాలను మాత్రమె సూచించాడు. దీనిని మెస్సియా సంకేతాలుగా అర్థం చేసుకోవచ్చు! యేసు, తన శిలువ బాధల యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకొని ఉండడంవల్ల యెషయా గ్రంధంలోని బాధామయ సేవక వాక్యాలను గ్రహించ గలిగాడు. ఆ దీర్ఘదర్శి తనను గురించే ప్రవచనం పలికాడని గ్రహించాడు. దుఃఖ భరితుడైన మెస్సీయా గురించి ఈ విధంగా పలికాడు, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగముమీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు” (యెషయా 50:6).

లోక విడుదలకై తాను చేపట్టే రక్షణ కార్యం పట్ల తాను గట్టి విశ్వాసం కలిగి ఉండడం మరియు ఆ కార్యం తన లోక జీవితాన్ని కోరుకుంటుందని యేసు చెప్పడం ప్రారంభించినప్పుడు, పేతురు యేసును మందలించాడు. పేతురు యేసుని అన్యత్వమయిన  మానవ స్వభావాన్నిఅంగీకరించలేకపోయాడు. యేసుకు “నీవు క్రిస్తువు” అని చెప్పడంలో పేతురు ఎటువంటి అభ్యతరం చూపలేదు. కానీ తాను నిజంగా ఎవరో అని యేసు వెల్లడించడం ప్రారంభించినప్పుడు మాత్రం, పేతురు సుస్పష్టంగా అసౌకర్యానికి గురయ్యాడు. నేడు, మనకు "శిలువ లేకుండా, కిరీటం లేదు" అని యేసు చెప్తున్నాడు. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ ఉండదుగా! అటువంటప్పుడు మనం ప్రతిరోజూ చేపట్టవలసిన "క్రాస్" ఏమిటి?

యేసువలె మనల్ని మనం తగ్గించుకొని ఇతరుల కొరకు శిలువను ఎత్తుకోవడానికి ఆతని చేత పిలువబడ్డాము. అలాగునే మన ప్రతీ దిన చర్య ఇతరులకు దైవీక ప్రాముఖ్యతను కలిగి ఉంటుoదని గ్రహించారా? మచ్చుకు... మనం డ్రగ్స్ తీసుకోవడం లేదా మద్య పానం ద్వారా మనల్ని మనం నాశనం చేసుకోము! ఎందుకు? కేవలం అది ఆత్మగౌరవం కోసం మాత్రమె కాదు. ఆత్మ గౌరవము కూడా ముఖ్యమే! కానీ మన ఆరోగ్యం అవసరమయిన ఇతరులు కూడా మనతో ఉన్నారని గ్రహించాలి. యువకులు వివాహానికి ముందు లైగింక సంబంధానికి దూరంగా ఉండాలన్నది తిరుసభ చట్టం వల్ల కాదు కానీ వారు జీవితాంతం ఎవరితోనైతే కట్టుబడి వుండాలనుకుoటున్నారో, ఆ జీవిత భాగస్వాములకు తమను తాము సంపూర్తిగా ఇచ్చుకోగలరన్నది దీవెనకరమైన నైతికత. వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల తమ ప్రేమను వెల్లడి చేసే అనేక విధి విధానాలలో పాతివ్రత్యం అన్నది ప్రాముఖ్యత. విరక్తత్వ జీవితాన్ని వ్రతంగా మొదలు పెట్టిన వాళ్ళు దైవానికి పరిపుర్తిగా అంకితమవడం పరోమోన్నతం. అలా క్రైస్తవ మతం అనేది స్వీయ-కేంద్రీకృత ప్రేమ కాదనీ, దైవ-పరోపకార ప్రేమకు అంకితం అన్నదే రోజువారి జీవిత శిలువ. దానిని భరించగలిగినప్పుడే ఒక క్రైస్తవుడు "ఆల్తేర్ క్రీస్తుస్" లేదా “మరొక క్రీస్తు” గా పిలువబడతాడు.

ఇపుడు మీరు, నేను “యేసు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలమా? 'ప్రపంచం యొక్క హింసలు, లోక పూరిత ప్రలోభాలు, లోకాశ శోధనలు మరియు దేవుని ఓదార్పుల మధ్య తిరుసభ తాను ఎప్పుడూ పురోగమిస్తూనే వుంటుంది' (n. 769) అని తిరుసభ సత్యోపదేశం మనకు గుర్తుచేస్తుంది. ఆ మాదిరిన క్రీస్తును అనుసరించడానికి మరియు అతనిని వెల్లడి జేసేందుకు మనకున్న మార్గం: “నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును"(మార్కు 8:34). మనలో ప్రతీ ఒక్కరo ఈ సువార్తను నమ్మకంగా జీవించడానికి పవిత్రాత్మ తన దీవెన బలాన్ని ఇస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.

“అతను శరీరంలో చనిపోతే, ఆమె అతనితో పాటు ఆత్మతో చనిపోలేదా?” (DO)

Saturday 7 September 2024

జీవమిచ్చే వాక్యానికి “తెరువబడుము” : యెషయ 35:4-7a; యాకోబు 2:1-5; మార్కు 7:31-37 (B 23)

 

జీవమిచ్చే వాక్యానికి “తెరువబడుము

యెషయ 35:4-7a; యాకోబు 2:1-5; మార్కు 7:31-37 (B 23)

“ఈ రోజు నిత్య కన్యక  జన్మించిది...  దేవుని తల్లిగా ఆమె తన రంగస్థల పాత్రకు సిద్ధమైంది" (DO)

 

ఈ నాటి సువిశేషo ద్వారా చెవుడు గల నత్తి వానికి కలిగిన వైద్యం (మార్కు 7:32) గురించి మనల్ని ధ్యానo చేయమంటుంది తల్లి శ్రీసభ. యేసు అతనిని జనసమూహం నుండి దూరంగా తీసుకెళ్లి, ఆ వ్యక్తి చెవుల్లో వ్రేళ్ళు పెట్టి, అతని నాలుకను తాకి, స్వర్గం వైపు చూస్తూ నిట్టూర్పువిడచి “ఎఫ్ఫతా” అని అరమాయిక భాషలో అన్నాడు. దీని అర్ధం “తెరువబడుము”. వెంటనే అతని చెవులు తెరవబడ్డాయి, అతని నాలుక విడుదలైంది. అతను స్పష్టంగా మాట్లాడాడ గలిగాడు (వ. 33-35). ఈ అరమాయిక పదం “ఎఫ్ఫతా” అన్నది ఆదిమ సంఘ రోజుల నుండి మన కాలం వరకు జ్ఞానస్నాన సంస్కార  ఆచారంలో భాగమైంది. జ్ఞానస్నాన సమయంలో గురువు, శిశువు చెవులు మరియు నోటిని తాకుతూ, "ప్రభువైన యేసు చెవిటివారు వినేలా మరియు మూగవారు మాట్లాడేలా చేసాడు. ఆయన తన మాటను అంగీకరించడానికి నీ చెవులను మరియు తండ్రియైన దేవుని స్తోత్రానికి మరియు మహిమకు తన విశ్వాసాన్ని ప్రకటించడానికి మీ నోరును త్వరలో ముట్టుకుంటాడు” అని ప్రార్ధిస్తాడు.


యేసు తన వేళ్లను మనిషి చెవుల్లో పెట్టడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? గ్రెగొరీ ది గ్రేట్ ఇలా అంటాడు, “ఆత్మను దేవుని వ్రేళ్ళు అంటారు. ప్రభువు చెవిటి-మూగ చెవులలో తన వేళ్లను ఉంచినప్పుడు, అతను పరిశుద్ధాత్మ బహుమతుల ద్వారా మనిషి యొక్క ఆత్మను విశ్వాసానికి తెరతీస్తున్నాడు”.  యేసు చెవిటి వ్యక్తిని జనసమూహం నుండి ఎందుకు దూరంగా తీసుకెళ్లాడు? దేవుని వాక్యానికి చెవిటితనం నుండి స్వస్థత పొందాలంటే, చుట్టూ ఉన్న సమూహాల నుండి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే యేసు స్వస్థత అన్నది ఒకరి స్వంత హృదయంలో జరుగుతుంది. మన చెవులు దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఇది చేయడానికి మనం అపసవ్య గుంపు నుండి దూరంగా ఉండాలి. మనం కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా మౌన ధ్యానంలో గడపాలి. ప్రభువు మనతో ఏమి చెబుతున్నాడన్న దానిపై మనం దృష్టి పెట్టాలి.


మార్కు సువార్తికుడు తన సువార్తను తొలి క్రైస్తవ హింసాకాండ కాలంలో రాశాడు. అటువంటి పరిస్థితిలో క్రీస్తు కొరకు మాట్లాడటం, సాక్ష్య మివ్వడం అన్నది అతి ప్రమాదకరమైన విషయం. ప్రభువు సాక్ష్యం రక్త ప్రాణాలను కోరింది. మార్కు చెప్పే చెవిటి-మూగవాని అద్భుత కథ యేసుకు సాక్ష్యమివ్వలేని అతని సంఘంలోని సభ్యులను లక్ష్యంగా చేసుకున్నదని మనకు స్పష్ట మవుతుంది. ఆయనను గూర్చి మాట్లాడడంలో వారికి వాగ్ధాటి ఉన్నప్పటికీ వారు యేసు మాటలకు చెవిటి-మూగ వారయ్యారు. అలాగునే చెవిటి-మూగ మరియు యేసు అనుచరుల మధ్య ఇదే సమాంతరత మనకు కన్పిస్తుంది. చెవిటి-మూగుడు సరిగా వినలేడు, మాట్లాడలేడు. అలాగునే యేసు మాట వినలేని పలుక లేని శిష్యుల్లోకూడా తమ సాక్ష్యానికి అడ్డంకిని పెంచుకుంటారు. వారికి ధైర్య వైద్యం కావాలి. అలాంటి స్వస్థత మాత్రమె యేసుకు సాక్ష్యం ఇవ్వడంలో అడ్డంకులను తొలగిస్తుంది.


యేసు సందేశానికి సాక్ష్యం ఇవ్వడంలో మనకు ఎలాంటి అవరోధం వుంది? విశ్వాసులుగా, సంఘముగా మనం స్వస్థత కోసం యేసు దగ్గరకు రావాలి. ఈ స్వస్థత కేవలం బలి పూజా వేడుకలోనే జరగవచ్చు. వైద్యం అన్నది శారీరకంగా, మానసికంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అందరికి వైద్యం ఎల్లప్పుడూ అవసరం. మచ్చుకు... మనల్ని మనం తగ్గించుకునే సందర్భాలు ఉన్నాయి. ప్రభువు ప్రేమించే వ్యక్తి పట్ల కొన్నిసార్లు మనం ప్రతికూలంగా ప్రవర్తిస్తూవుంటాము. అప్పుడు మనతో మనం సంతోషంగా ఉండలేము. అది మనకు నిజంగా అవసరమా? ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ మన అవగాహనకు మించినవి. "ఎఫ్ఫతా” అంటే “తెరువబడుము". మనం ఇతరులకు స్వస్థతా వాహనాలుగా ఉండాలని యేసు మనలనుండి కోరుకుంటున్నాడు. దానికి తగినట్లుగా మనము ఆతనితో వుంటే ఆతను మనల్ని స్వస్థపరుస్తాడు.


“సృష్టికర్తకు దైవిక నివాస స్థలంగా ఒక కొత్త జీవి సిద్ధమైంది” (DO)