AletheiAnveshana: దేవునితో మానవుని రహస్య కలయిక

Monday, 24 March 2025

దేవునితో మానవుని రహస్య కలయిక

 


దేవునితో మానవుని రహస్య కలయిక

మనస్సు ద్వారా వినయం, శక్తి ద్వారా బలహీనత, శాశ్వతత్వం ద్వారా మరణము అనుగ్రహించబడతాయి. బాధను భరించలేని మన అసమర్థ స్వభావం, ఆ పాపపు స్థితి రుణాన్ని తీర్చడానికి, వ్యాకులతను తాళ గలిగే స్వభావంతో జోడించబడింది. అందువలన, మనకు అవసరమైన స్వస్థతకు అనుగుణంగా, దేవునికి మరియు మనుష్యులకు మధ్య ఒకే  మధ్యవర్తి అయిన మానవుడు యేసుక్రీస్తు ఒక స్వభావంలో చనిపోగలిగాడు మరొక స్వభావంలో చనిపోలేకపోయాడు. కాబట్టి నిజమైన దేవుడు నిజమైన మానవుని పూర్తి  పరిపూర్ణ స్వభావంలో జన్మించాడు. తన స్వంత దైవిక స్వభావంలోనూ, పరి పూర్తిగా, మన స్వభావంలో జనించాడు. మన స్వభావం అంటే సృష్టికర్త ప్రారంభం నుండి మనలో ఏమి రూపొందించాడో తిరిగి దానిని పునరుద్ధరించడానికి తనను తాను అదే స్వభావాన్ని తీసుకున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాము.

మనిషిని తప్పుదారి పట్టించిన మోసగాడి జాడ రక్షకుడిలో లేదు. అందువలన అతను మన మానవ బలహీనతలో పాలుపంచుకోగలిగాడు. అతను మన పాపాలను తన భుజాన వేసుకున్నాడు. అతను పాపపు  మచ్చ లేని సేవకుడి స్వభావాన్ని తీసుకున్నాడు. తన దైవత్వాన్ని తగ్గించకుండా మన మానవత్వాన్ని హెచ్చించాడు. ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడు. అదృశ్యతను కలిగి ఉన్నప్పటికీ, తనను తాను మనకు కనిపించేలా చేసుకున్నాడు. అన్నిటికీ సృష్టికర్త ప్రభువు అయినప్పటికీ, ఆయన మర్త్య మానవులలో ఒకరిగా ఉండాలని ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఇది కరుణకు కలిగిన దయ. అంతేగాని సర్వశక్తిని కోల్పోవడం కాదు. కాబట్టి దేవుని స్వభావంలో మనిషిని సృష్టించినవాడు సేవకుడి స్వభావంలో మానవుడిగా మారాడు. ఆ విధంగా దేవుని కుమారుడు ఈ నీచమైన లోకంలోకి ప్రవేశించాడు. ఆయన పరలోక సింహాసనం నుండి దిగివచ్చాడు. అయినప్పటికీ తండ్రి మహిమ నుండి తనను తాను వేరు చేసుకోలేదు. ఆయన ఒక కొత్త స్థితిలో కొత్త జన్మ ద్వారా జన్మించాడు.

ఆయన ఒక కొత్త స్థితిలో జన్మించాడు. ఎందుకంటే ఆయన తన స్వభావములో కనిపించకుండా, మన స్వభావములో కనిపించాడు. మన స్థితికి అతీతంగా ఆయన మన స్థితిలోకి రావాలని ఎంచుకున్నాడు. కాలం ప్రారంభం కావడానికి ముందే ఉనికిలో ఉన్నవాడు. ఆయన కాలంలోని ఒక క్షణ కాలం పాటు ఉనికిలోకి రావడం ప్రారంభించాడు. విశ్వ ప్రభువు, ఆయన తన అనంతమైన మహిమను దాచిపెట్టి, సేవకుడి స్వభావాన్ని తీసుకున్నాడు. దేవుడిగా బాధపడటానికి అసమర్థుడు. ఆయన మనిషిగా ఉండటానికి నిరాకరించలేదు, బాధపడటానికి సమర్థుడు. ఆయన అమరుడు మరియు  మరణ నియమాలకు లోబడి ఉండాలని ఎంచుకున్నాడు. నిజమైన దేవుడు కూడా నిజమైన మనిషి. మానవుని అణకువ మరియు దేవుని గొప్పతనం పరస్పర సంబంధంలో కలిసి ఉన్నంత వరకు ఈ ఐక్యతలో అబద్ధం అనేది లేదు.

దేవుడు మారనట్లే, ఎల్లకాలము ఆయన మారని దేవుడు కాబట్టి అతి ఉన్నతంగా మార్చబడిన మానవుడు ఎన్నటికి మోసగాని ఉచ్చులో మ్రింగివేయబడడు. ప్రతీ ప్రకృతి జీవి మరొకదాని సహవాసంలో దాని స్వంత కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాక్కు వాక్యానికి తగినది చేస్తుంది. శరీరం శరీరానికి తగినది నెరవేరుస్తుంది. ఒక స్వభావం అద్భుతాలతో ప్రకాశిస్తుంది. మరొకటి గాయాలకు గురవుతుంది. వాక్కు తండ్రి మహిమతో సమానత్వాన్ని కోల్పోనట్లే, శరీరం మన జాతి స్వభావాన్ని వదిలిపెట్టదు. ఆయన నిజంగా దేవుని కుమారుడు మరియు నిజంగా మనుష్యకుమారుడు. ఆయన ఒకే ఒక్క వ్యక్తి. ఆదిలో వాక్కు  ఉంది. ఆ వాక్కు దేవునితో ఉంది. ఆ వాక్కు దేవుడు అనే వాస్తవం ద్వారా ఆయన దేవుడు. వాక్యం శరీరధారియై మన మధ్య నివసించింది అనే వాస్తవం ద్వారా ఆయన మానవుడు. దీనిని పదే పదే చెప్పాలి.

పునీత లియో ది గ్రేట్ పోపు గారు వ్రాసిన లేఖ నుండి తీసుకోబడినది (Divine Office)

No comments:

Post a Comment