నేను నీతో ఉన్నాను
కాబట్టి నువ్వు ఓడిపోకూడదు
ద్వితీ 26:4-10;
రోమా 10:8-13;
లూకా 4:1-13
(C లెంట్/1)
“ప్రభువు సిలువ మనకు జీవవృక్షమాయెను” (Divine
Office)
లోక రక్షకునిగా తన కోసం తండ్రి ద్వారా బాప్తిస్మం తీసుకొని
ధృవీకరించబడిన వెంటనే, యేసు అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ ద్వారా
అరణ్యంలోకి నడిపించబడ్డాడని మూడు సారూప్య సువార్తలు నివేదిస్తున్నాయి. మోషే (నిర్గ
24:18) మరియు ఏలీయా (1 రాజు 19:8)
కోసం దేవుడు ఏర్పాటు
చేసిన నమూనా కూడా ఇదే. దేవుణ్ణి కలవడానికి ఈ ఇద్దరూ నలభై రోజుల ఉపవాస ప్రార్థన ప్రయాణంలో నడిపించబడ్డారు. కానీ
ఆతని వాక్యాన్ని ప్రకటించడానికి (నిర్గ 33:11; దితీ 18:15;
34:10), ప్రజలను పవిత్రత,
నీతివంతమైన జివితంలోనికి నడిపించడానికి దేవుడు మోషే మరియు ఏలీయాను పరీక్షించాడు. వారు
ఇరువురు అరణ్యంలో ఉపవాస ప్రార్థనలు చేశారు. దేవుడు వారిని తన జీవమిచ్చే వాక్కుతో భోజనం
పెట్టాడు. వారు విశ్వాసం, ఆశ మరియు ప్రేమలో పునరుద్ధరించబడ్డారు.
యేసు అరణ్యంలో నలభై రోజులు గడిపిన
తర్వాత, సాతాను అతనిని శోధించాడని లూకా వ్రాస్తున్నాడు. ఈ మోసగాడు
అపవాది (లూకా 4:1), అబద్ధాలకు తండ్రి (యోహా 8:44) మరియు ఈ లోక పాలకుడు (యోహా 12:31;
2 కొరింథీ 4:4).
పరదైసు తోటలో ఆదాము
హవ్వలను శోధించిన మోసగాడే అతడే (ఆది 3). సాతాను యేసును ఎందుకు శోధించాడు? దేవుని రాజ్యం కోసం యేసు ఒక ప్రాముఖ్యమైన
ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేపడుతున్నాడని సాతానుకు తెలుసు. యేసు శారీరకంగా మరియు
మానసికంగా బలహీనంగా ఉన్నట్లు కనిపించినప్పుడు సాతానుకు దాడి చేసే అవకాశం
లభించింది. అతను సుదీర్ఘ ఉపవాస ప్రార్ధనలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు
కనిపించాడే కానీ దైవత్వమున ధీరుడే. తండ్రి దేవుని మార్గాన్ని కాకుండా తన మార్గాన్ని
ఎంచుకునేలా యేసును ఒప్పించగలనని సాతాను నిస్సందేహంగా భావించుకున్నాడు.
సాతాను మొదటి శోధన యేసు శారీరక
ఆకలిని ఆకర్షించింది. ఆ ఆకలి బాధ మరణ త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ తన తండ్రి వాక్కు
కోసమే యేసు ఆ ఆకలిని భరించాడు. యేసు ఉల్లేలేఖన పదాలతో సాతాను ఉచ్చును ఇలా ఓడించాడు, "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతీ వాక్కువలనను
జీవించును" (ద్వితీ 8:3; మత్త 4:4). లోకం అందించగల అతి ఉత్తమమైన సుందరమైన
వాటిని అతనికి అందించే ప్రయత్నంలో సాతాను రెండవసారి యేసును శోధించాడు. కానీ “నీ
దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవించాలి” (ద్వితీ 6:13) అన్న జీవ వాక్కుతో ఉటంకించడం
ద్వారా తన తండ్రి చిత్తాన్ని మాత్రమే తన సంపదగా మరియు ఆనందంగా చేసుకోవాలని యేసు
ఎంచుకున్నాడు. సాతాను చివరి శోధన విచిత్రమైనది. సృష్టికర్తకే సృష్టి అందాన్ని చూపించడం! యెరూషలేములోని ఆలయ శిఖరాన తనను తాను
నిలబెట్టుకోవాలనీ, తాను మెస్సీయ అని నిరూపించే ఒక సూచనను చేయాలనీ చెపుతూ జీవ
వాక్యాన్ని ప్రభువుకు ఎత్తి చూపడం! సైతాను కూడా పరిశుద్ధ గ్రంధాన్ని బాగా
చదివాడన్న మాట. చూడండి ఎలా కీర్తన
వాక్యాన్ని చెపుతున్నాడో! "ఆయన నిన్ను కాపాడటానికి తన దూతలను ఆజ్ఞాపిస్తాడు.
వారు తమ చేతులపై నిన్ను మోస్తారు. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు”
(కీర్త 91:11-12). తాను మెస్సీయ అని తన దైవిక వాదనను
నిరూపించుకోవడానికి సాతాను చేసిన పరీక్షను యేసు ఇలా తిరస్కరించాడు. “‘నీ దేవుడైన
ప్రభువును పరీక్షించకూడదు’ అన్న వాక్యంతో (ద్వితీ 6:16) ఉటంకించాడు.
మన స్వంత జీవితాల్లో శోధనలతో
పోరాడి పాపాన్ని అధిగమించడానికి మనం ఎలా ఆశించవచ్చు? యేసు పరిశుద్ధాత్మచే
నడిపించబడ్డాడు. దేవుడు మన నిజ విశ్వాసాన్ని ఒక ఉదాహరణగా చూపడానికి దానిని పరీక్షకు
గురుచేస్తాడు. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. మనం భరించగలిగినంత కంటే ఎక్కువగా
మనల్ని శోధించనివ్వడు” (1 కొరింథీ 10:13). “మీరు కుడివైపుకు
తిరిగినప్పుడల్లా, ఎడమవైపుకు తిరిగినప్పుడల్లా, ‘ఇదే మార్గం, దీనిలో నడువు’ అని మీ వెనుక నుండి
ఒక శబ్దం మీ చెవులకు వినబడుతుంది” (యెష 30:21).
యేసు తన మానవ బలంపై
ఆధారపడలేదు. మన బలహీనతలో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ బలం మార్గదర్శకత్వం
అవసరమని ఆయన నేర్పిస్తున్నాడు (రోమా 8:26). మనం ఆయనపై ఆధారపడటాన్ని
అంగీకరించినప్పుడు ఆయన మనతో ఉంటాడు (యోహా 4:6). సాతాను దాడులకు వ్యతిరేకంగా
స్థిరంగా నిలబడటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు (1 పేతు 5:8-10;
ఎఫె 6:10-18).
పాపాన్ని
అధిగమించడానికి, పాపపు సమీప సందర్భాలను
నివారించడానికి మనం దేవుని జ్ఞాన మార్గదర్శకత్వాన్ని వెతుకుతున్నామా? నలభై రోజుల లెంట్‌లో, ఈస్టర్ పండుగ వైపు మన ఆధ్యాత్మిక
పునరుద్ధరణ యొక్క అరణ్యంలో ప్రభువుతో ప్రయాణించడానికి మనం పిలువబడ్డాము. క్రీస్తు
మరణం మరియు పునరుత్థానం విజయంలో పాలుపంచుకోవడానికి మనం కూడా సిలువ మార్గాన్ని
అనుసరించాలి. ఈ పవిత్ర వడకం మరియు పునరుద్ధరణ సంయంయంలో - విశ్వాసం, ఆశ మరియు ప్రేమలో మనం ఎదగడానికి
ఆయన పరిశుద్ధాత్మ నూతన ప్రవాహం కొరకు ప్రార్థిద్దాం.
“మీరు కత్తికి బలైపోరు. మీ జీవితం సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీతో ఉన్నాను” (Divine
Office)