మలాకి 3:1–4; హెబ్రీ
2:14–18; లూకా 2:22-40 (4
C)
“ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు
ప్రథమ సంతతి, అనగా
ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను” (నిర్గమ 13:1)
ఈ రోజు బాల యేసు సమర్పణ పండుగను మాతృ శ్రీసభ ఘనపరుస్తుంది. క్రీస్తు
జయంతి 40 రోజులు తర్వాత వచ్చే ఈ పండుగ గురించిన విషయాలను లూకా సువార్తలో
మాత్రమే ప్రస్తావించబడినాయి. యూదుల శుద్ధీకరణ సంస్కారములను గురించి తెలియని నూతన
క్రైస్తవుల కోసం తన సువార్తలో లూకా వ్రాసాడు. యేరూశలేము ఆలయ పునఃనిర్నిర్మాణ సమయంలో, ఆ దేశంలో తాండవించిన ఆనాటి పేదరికం దేవుని బిడ్డలను బాగా నిరుత్సాహపరిచింది. అప్పుడు
ప్రవక్త హగ్గయి దేవుని స్వరాన్ని ఇలా ప్రవచించాడు, “నేను అన్యజనులనందరిని కదలింపగా
అన్యజనులందరి యిష్టవస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును...ఈ కడవరి మందిర మహిమ
మునుపటి మందిర మహిమను మించును. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు
యెహోవా వాక్కు” (హగ్గయి 2:7, 9).
బాల యేసు తల్లి దండ్రులు యెహోవా ఇచ్చిన చట్టం, “ఇశ్రాయేలీయులలో
మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి,
అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు
ప్రతిష్ఠించుము; అది నాది” అన్న చట్టాన్ని పరిపూర్తి చేశారు. ఆలయంలో బాల యేసును సమర్పించడంలో, హగ్గయి ప్రవచనం నెరవేరిందని మనకు సుస్పష్టమయింది. యేసు రాకతో ఆలయమంతా
దైవీక తేజస్సుతో నిండిపోయింది. సిమియోనుడు
“ప్రభువు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు” అని పరిశుద్ధాత్మచేత ఒక వరమును
పొందుకున్నాడు. అందువలననే తల్లి దండ్రులైన మరియ యోసేపులు తమ అద్వితీయ కుమారుడు యేసును
ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు “ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను"
(లూకా 2:26).
అని లూకా
వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో, సిమియోను ఆలయంలోనికి వెళ్ళాడు. అతను లేవీయుడు కాదు, వాగ్గేయకారుడు కాదు లేదా న్యాయశాస్త్ర పండితుడు కాదు. అతను కేవలం "నీతిమంతుడు భక్తిపరుడు, ఇశ్రాయేలు ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నవాడు" మాత్రమె
(లూకా 2:25)! పరిశుద్ధాత్మ తనకు నచ్చిన చోటుకు ప్రవహిస్తుంది (యోహాను 3:8). అతను ఇశ్రాయేలు ఇంటి మహిమను
మరియు కొత్త ఇశ్రాయేలు అయిన సర్వలోక పీడనాన్ని చూశాడు. తల్లి మరియ హస్తాలలో ఉన్న మహిమాన్విత శిశువు యేసును
చూసినప్పుడు అతను కీర్తనకర్త మాటలను ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు, “మహిమ కలిగిన రాజు లోపలికి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన
తలుపులారా, తెరుచుకోండి" (కీర్తన 24:7).
సిమియోను బాల యేసును తన చేతుల్లోకి తీసుకొని దేవుణ్ణి
స్తుతిస్తూ ఇలా అన్నాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని నిష్క్రమింపనిమ్ము!
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు
సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని" (లూకా 2:29-32). ఈతని ప్రార్థన మాతృ శ్రీసభ రాత్రి కాల ప్రార్థన [Nunc dimittis (Divine Office)]లో భాగమయింది. తల్లి తండ్రులు, యేసును గూర్చి చెప్పబడిన విషయానికి చాలానే ఆశ్చర్యపడ్డారు!
అప్పుడు సిమియోనుడు మరియ తల్లితో “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొని పోవును”
(లూకా 2:35) అని ప్రవచనం చెప్పాడు.
చీకటిని పారద్రోలడానికి, అతని వైభవంలో మనందరికీ భాగస్వామ్యం
కల్పించడానికి నిజమైన వెలుగును పంపిన దేవునికి కృతజ్ఞతా గీతాన్ని సిమియోనుతో కలసి ఆనందిస్తూ
ఆలపిద్దాం. పునీత సోఫ్రోనియసు ఇలా అంటాడు, “సిమియోనుని కనుల ద్వారా మాత్రమె కాకుండా మనం కూడా దేవుడు ఏర్పరిచిన
లోక రక్షణను కనులారా చూస్తున్నాము. కొత్త ఇశ్రాయేలు అయిన మన కోసం సిద్ధం చేయబడిన యేసునందు
మోక్షాన్ని ప్రతీ రోజు వాక్యమందును దివ్య సత్ర్పసాదమమందును అనుభూతి చెందుతున్నాము.
సిమియోనుడు రక్షకుడు యేసును చూసినప్పుడు ఈ జీవిత బంధాల నుండి విడుదల పొందినట్లుగా, మనం కూడా దేవుణ్ణి మనలోనూ ఇతరుల్లోనూ చూడగలిగినప్పుడు మన
భారాల నుండి విముక్తి పొందుతాము. ఎందుకంటే ఆత్మ ఘోషను దాని దాహాన్ని మనము ".. దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది.
నేను ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తాను? (కీర్త
42:2) అని వింటూనే ఉన్నాము. మనమందరం మరియ తల్లి బిడ్డలం కాబట్టి, యేసును దేవధి దేవునకు సమర్పించినట్లుగా మనలను కూడా తన చేతుల
మీదుగా సర్వోన్నతుడైన దేవునకు సమర్పించమని ఆమెను కోరుకుందాం.
"మనం వెలిగించిన కొవ్వొత్తులు మన ఆత్మల దివ్య వైభవానికి
సంకేతం" (Divine Office)
No comments:
Post a Comment