AletheiAnveshana: నా ఆధ్యాత్మిక జీవిత తనిఖీ: సిరాకు 27: 4-7; 1 కొరింథి 15: 54-58; లూకా 6:39-45 (8 C)

Friday, 28 February 2025

నా ఆధ్యాత్మిక జీవిత తనిఖీ: సిరాకు 27: 4-7; 1 కొరింథి 15: 54-58; లూకా 6:39-45 (8 C)

 

నా ఆధ్యాత్మిక జీవిత తనిఖీ

సిరాకు 27: 4-7;  1 కొరింథి 15: 54-58; లూకా 6:39-45 (8 C)

మనం భగవంతుని నుండి సంతోషాన్ని తీసుకుంటే, దుఃఖాన్ని కూడా తీసుకోకూడదా? (Divine Office)


ఈ రోజు సాధారణ అర్చన కాలపు ఎనిమిదో ఆదివారం.  సాధారణంగా, తపస్సుకాలం ఈపాటికే ప్రారంభమయ్యేది. కానీ ఈ సంవత్సరం ఆలస్యంగా వచ్చింది. మళ్ళి మనము జూను మాసములో సాధారణ అర్చన కాలానికి తిరిగి వచ్చినప్పుడు, సాధారణ ఆర్చన కాల సంవత్సరాన్ని 9వ లేదా 10వ ఆదివారంతో ప్రారంభిస్తాము. నేటి సువార్త పఠనమంతా సామెతలతో నిండి ఉంది. అవి సత్యపు పదబంధ ప్రకటనలు! చెప్పబడిన వాటి నన్నింటిలో ముచ్చటగా మూడింటి గురించి ధ్యానించుదాము.  మొదటిగా, "మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. చెడు చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. ప్రతి చెట్టు దాని దిగుబడిని బట్టి తెలుస్తుంది” (లూకా 6: 43).  ఇది మానవ వ్యక్తిత్వాన్ని చూపించే ఒక సాదృశ్యం. ఒక వ్యక్తి మంచి పనులు చేసినప్పుడు, ఆ వ్యక్తి మంచి వారు అని మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి నిరంతరం ఇబ్బందులను రేకెత్తిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మానసికంగా సామాజికంగా ఇబ్బంది పడుతున్నాడని మనకు తెలుస్తుంది. పండు అనే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా వెల్లడిస్తుందో మనం రక్షింపబడ్డామా లేదా, ఇంకా రక్షింపబడలేదా అని కూడా తెలియచేస్తుంది కదా!

 

రెండవది, నీవు నీ కంటిలో ఉన్న దూలమును  ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? (లూకా 6:41). ఒక్కొక్కసారి మన వైఫల్యాలపై మనకు కలిగిన చికాకును ఇతరులపై చూపుతాము. దీనినే మనస్తత్వ శాస్త్రం ఆంగ్లంలో “డిఫెన్స్ మెకనిజం” అని పిలుస్తుంది. ఇది మనకు చాలానే కుటుంబంలో, సమాజంలో కన్పిస్తుంది కదా! గమనించారా? మనం ప్రతికూల సమయాలను ఎదుర్కొన్నప్పుడు, మనం ఒక అడుగు వెనక్కి తీసుకోవాలి. మనల్ని మనం, అలాగునే మనం, ఇతరులను కలవరపరిచే విధంగా ఏమి చేస్తున్నామో అని కుడా పరిశీలించుకోవాలి.

 

మూడవదిగా, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా” (లూకా 6:39). మనం మంచి విలువలను కలిగి ఉన్నంత వరకు మనం ఇతరులకు వారి మార్గనిర్దేశం చేయలేము. మన ఎడల మనం మంచి అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఒకరి లోపాలను సరిదిద్దడంలో ముందు మనం నిబద్దత  కలిగి ఉండాలి. కథోలిక మత బోధనాధికారాన్ని “మెజిస్టీరియం” అంటారు. మేజిస్టీరియంలో పోపు గారు,  పీఠాధిపతులు, వేదవేత్తలు మరియు చట్ట సలహాదారులు ఉంటారు.

 

 మేజిస్టీరియం మన విశ్వాసం మరియు నైతికతలను పరిణామం చెందుతున్న కాలానికి అనుసంధానించడానికి మార్గాన్ని నిర్దేశిస్తూవుంటుంది. మత సైద్ధాంతిక ప్రకటనలు లేదా బోధనలు అనేవి కేవలం గ్రుడ్డిగా ప్రకటింప బడవు. మాతృ శ్రీసభ తనను గురించిన అవగాహనలో తానే వృద్ధి చెందుతూ అనేక శతాబ్దాలుగా తన బోధనా క్రమతను అభివృద్ధి చేసుకున్నది. మెజిస్టీరియం కేవలం సోపానక్రమంలోనే ఉండదు. ఇది మన పరివారంలోనూ మరియు భద్రమైన అభ్యంగ దివ్య సంస్కారము పొందిన వారిలో కూడా ఉంది. విశ్వాసం గురించిన మన అవగాహనలో మనం ఎదగడానికి పరిశుద్ధాత్మ వరం మనకు సహాయం చేస్తుంది. సందేహాలు మరియు అనిశ్చితి సమయాల్లో, విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయమని మనం పరిశుద్ధాత్మను ప్రార్థించాలి. అంధుడు మరొక అంధుడిని నడిపించలేడు. సిద్ధి పొందిన మెజిస్టీరియం మన అనిశ్చల అంధకార సమయంలో మనకు సహాయంగా నిలబడి వెలుగును చూపిస్తుంది.


యేసు స్వీయ ధర్మానికి లేదా అహంభావానికి వ్యతిరేకి. దానినే హెచ్చరించాడు. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు కాబట్టి ధర్మశాస్త్రపు అక్షర తత్త్వము ఆతనికి సరిపడదు. అందుకే ఆయన మనల నుండి ఆత్మవిమర్శను కోరుకుంటున్నాడు. అందుచేతనే మనం సరైన ఉద్దేశ్యంతో సరైన పనిని చేయాలి. మన అంతరంగ ఉద్దేశాలను శుద్ధి చేసుకోవడానికి, మన హృదయాలలో ఉన్న దేవుని వైపు మళ్లాలి. ప్రభువా, నాలో స్వచ్ఛమైన హృదయాన్ని సృష్టించు. నాలో దృఢమైన ఆత్మను ఉంచుము” (కీర్తన 51:10) అన్న దావీదు రాజు ప్రార్థనలోని అర్థం ఇదే!

 

"ఆయన ధర్మశాస్త్రానికి మరియు ఆజ్ఞలకు నీ హృదయాన్ని తెరవాలి" (Divine Office)

 

 

 

 

 

No comments:

Post a Comment