AletheiAnveshana: నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును: యిర్మియా 17:5-8; 1 కొరింథి 15:12,16-20; లూకా 6:17,20-26 (6 సి)

Saturday, 15 February 2025

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును: యిర్మియా 17:5-8; 1 కొరింథి 15:12,16-20; లూకా 6:17,20-26 (6 సి)

 

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును

యిర్మియా 17:5-8; 1 కొరింథి 15:12,16-20; లూకా 6:17,20-26 (6 సి)

మనము దేవుని శక్తి అయిన సిలువపై క్రీస్తును ప్రకటిస్తున్నాము” (Divine Office)

 

లూకా సువార్తలో మనకు కన్పించే మైదాన ప్రసంగ ప్రారంభం మత్తయి 5:1-7,11 “పర్వత ప్రసంగం” వలె ఉంటుంది. సువార్త పఠనాల మధ్య ఈ శీర్షికలు కొద్ది పాటి సారూప్యతలను సూచిస్తున్నాయి. మత్తయి తన సువార్తలో వ్రాసిన ధన్య వచనాల కంటే లూకా తన సువార్తలో వ్రాసిన ధన్యవచనాలు చాలా వ్యక్తిగతమైనవిగా కన్పిస్తాయి. లూకా “మీరు” అనే సర్వనామం ఉపయోగిస్తుండగా మత్తయి “వారు” లేదా “అయిన వారు” అని ఉపయోగిస్తాడు. సంఖ్యలో కూడా తేడా కన్పిస్తుంది. మత్తయి ఎనిమిది ధన్య వచనాలను వివరిస్తే లూకా కేవలం నాలుగు సమాంతర ధన్య వచనాలను హెచ్చరికలతో కలిపి అందజేస్తాడు.

 

సువార్తలలొ మనకు కన్పించే ధన్య వచనాల రూపం యేసు స్వంత ప్రత్యేక బోధన కాదు. కీర్తనలు మరియు జ్ఞాన సాహిత్య గ్రంథాల వంటి పాత నిబంధనలో కూడా ఇటువంటి ధన్య వచనాలు కనిపిస్తాయి. ‘దుష్టుల ఆలోచనలు కాకుండా యెహోవా చట్టాన్ని అనుసరించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు’ అనే నేటి ప్రత్యుత్తర కీర్తన "రెండు మార్గాలు" అనే ఆలోచనను మనకు అందిస్తుంది. సామాజిక న్యాయం మరియు సమాంతర నిబద్ధత గురించి ప్రవక్తలు హెచ్చరించారు: “ఇంటికి మరొక ఇల్లు చేర్చి, పొలానికి మరొక పొలం చేర్చేవారికి అయ్యో, ప్రతిదీ వారికే చెందుతుంది! తెల్లవారుజాము నుండి మత్తు పానీయాల కోసం వెంబడించి, బ్రాందీలో తేలియాడుతూ రాత్రిపూట మెలకువగా ఉండేవారికి అయ్యో అనర్ధము! చెడును మంచిగా, మంచిని చెడుగా పిలచి వెలుగును చీకటిగా మార్చేవారికి అయ్యో!!  లంచం కోసం దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టి, మంచి వ్యక్తిని మోసం చేసేవారికి అయ్యయ్యో!!! (యేష 5:8-23).  ఇవన్నీ ప్రవక్తలు మొదట ప్రకటించినప్పుడు ఎంతో సందర్భోచితంగా ఉండేవి.


"రెండు మార్గాలు" - "మంచి మరియు చెడు" అనే భావన ఆదిమ క్రైస్తవ సంఘాన్ని లోతుగా ప్రభావితం చేసింది. యేసు ఆనంద మార్గం మారు మనస్సు లేదా అంతరంగిక పరివర్తనను కోరుతుంది. ఇది కేవలం పరిశుద్ధాత్మ క్రియ  ద్వారా మాత్రమె మనస్సులో మార్పు చేకూరుతుంది. పేదరికం, ఆకలి, దుఃఖం మరియు హింసలలో ఆనందాన్ని ఎలా పొందగలరు అనేది మనకు ఎదురయ్యే ప్రశ్న! మనం స్వర్గపు ఆనందంతో నింపబడాలంటే, హృదయాలలో దేవుణ్ణి మూసివేసిన లేదా కమ్మివేసిన సమస్త విషయాల నుండి మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. మిలాను ప్రాంతపు పునీత ఆంబ్రోసు ఒక ఆదిమ సంఘ పితృపాదులు. మన నైతిక శ్రేష్ఠతను బలపరిచే నాలుగు ప్రధాన ధర్మాలతో దీవెనలను అనుసంధానించాడు ఆంబ్రోసు. అవి నిగ్రహం, న్యాయం, వివేకం మరియు దృఢత్వం. ధన్యులైనవారు ఆత్మలో పేదవారు, విధేయులు మరియు ప్రశాంతంగా ఉంటారు. వారు తమ ఆస్తులను పేదలకు విరాళంగాఇచ్చి వేసుకుంటారు. వారు పొరుగువారిని కుట్ర పూరితమైన ముసుగులోనికి దించరు. ఈ ధర్మాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందువల్ల, నిగ్రహానికి హృదయం, ఆత్మకు స్వచ్ఛత, న్యాయానికి కరుణ, సహనానికి శాంతి మరియు ఓర్పులో సౌమ్యతను కలిగి ఉంటారు.

 

పేదల ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లుగా మరియు దాని పునరుద్ధరణను గురించి మనం ఎంత విరివిగా ఆశావాద వార్తలను సామాజిక మాధ్యమాలలో వినగలం, చెప్పండి? అభివృద్ధి చెందిన ప్రపంచంలోని ఆర్థిక వృద్ధి అందునా ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ - వస్తు సంపద వినియోగంలో “రోబోటు”ల విచ్చల విడితనానికి మరియు మనిషికి కూలి కరవైన భవిష్యత్తుకు మధ్య అగాధాన్ని కప్పివేస్తుంది! రెచ్చగొట్టే వస్తు వినియోగదారుల వ్యవస్థ అన్నది కడుపు నిండని కష్టార్జితుల కన్నీళ్ళు వారి  అభద్రతతో విభేదిస్తుంది. పునీత రెండవ జాన్ పౌలు  దీనిని ఇలా ఖండించారు, "... దాదాపు స్వయంచాలకంగా వ్యవస్థ పని చేస్తుంది. కొందరికి సంపద మరికొందరికి పేదరికం అనే పరిస్థితులను మరింత కఠినతరం చేస్తుంది." అలాంటి పరిస్థితిని “చావైన పాపం” అని తన సువార్త ఆధారిత (ఎన్సైక్లల్)  “సొల్లిసితూదో రేయ్ సోసియాలిస్” (ది సోషల్ కన్సర్న్) అనే అధికారిక పత్రంలో  పేర్కొన్నాడు. నేటి మనిషి/మానవత్వ ఉనికిని కప్పివేసే కృత్రిమ మేథ (AI)ను ఖండించగలిగే ఆతని బోధనలు ప్రతిబింబిస్తున్నాయి. దేవుడు ఇచ్చిన తెలివితేటలను దుర్వినియోగం చేయడం ద్వారా నేటి కృత్రిమ మేథ (AI) ను దాని స్పృహ (కాన్షియస్నెస్) లోనికి తీసుకురావడం వంటి వస్తు సంపద దుర్వినియోగం లాంటి విషయాలు బాబేలు గోపురపు దుశ్చర్యలకు దేవుని ప్రతిచర్యను ప్రతిబింబించేలా చేస్తుంది, కదా!

 

పునీత రెండవ జాన్ పౌలు  తన “ఫిదేస్ ఎత్ రాత్సియో (ఫెయిత్ అండ్ రీసన్/ మతము మరియు సైన్సు) అన్న అధికారిక పత్రంలో విశ్వాసము లేదా మతము అన్నది అన్ని రకాల ఒంటరితనాన్ని దాటి ముందుకు వెళ్లడానికి కారణాన్ని లేదా సైన్సును ప్రేరేపిస్తుంది. అలివిగాని కష్టతరం అన్న సమస్యనుకూడా అధిగమించి మానవాళికి అందమైనది, మంచిదైనది మరియు నిజమైన దేనినైనా సాధించి ఇష్టపూర్వకంగా అమలు చేస్తుంది” అని వ్రాసారు. కాబట్టి ఆర్ధిక స్థూల వ్యవస్థలో వస్తు వినియోగం, మానవ జ్ఞాన/ విజ్ఞాన సంపత్తి వినియోగం - లోక, అధ్యాతిక దారిద్ర్య చీకటిని రూపు మాపడానికి, సర్వ మానవాళి మనుగడకు ధన్యమార్గ మవ్వాలి. యేసు భాగ్య వాక్యాలు పోలిమేరల్లోకి గెంటి  వేయబడి, అణగారిపోయి పగతో రగులుతున్నవారి శక్తిహీనత నుండి పుట్టలేదు కానీ అన్యాయపు అధర్మ  విజయాన్ని అనుమతించని దేవుని దీర్ఘ దృష్టి నుండి మాత్రమె పుట్టింది. యేసు మాట ధనవంతులకు మరియు పేదలకు నిర్ణయాత్మకమైనది! ఖండించడం మరియు ప్రోత్సహించడం అనే భాగ్య పదజాలం ఎప్పుడూ సజీవంగా ఉటుంది. అది మనందరి ముందు ఎప్పుడూ సవాలుగా నిలుస్తుంది!

 

ధన్యులైన విశ్వాసులు ప్రార్థనాపరులు. వారు తమ మూల వేళ్ళను భూగర్భ జలం అనే దేవునిలోనికి చొచ్చుకొని  విస్తరించుకునే వారుగా ఉంటారు (కీర్తన 1:1). వారు భగవంతునిపై ఆధారపడి ఉంటారు. నిర్మలంగా వుంటారు. దేవునిపై ఆధారపడటం అనేది వారి బలహీనతకు సంకేతం కాదు. అది వారిని ఎప్పటికీ అంతం లేని దేవుని శక్తి బంధంలో నిలబెడుతుంది. విజయవంతులను చేస్తుంది. ఆమేన్.

"...ఈ ప్రపంచం జ్ఞానంగా భావించేది దేవుని దృష్టిలో అర్ధంలేనిది" (Divine Office)


No comments:

Post a Comment