AletheiAnveshana: కానా వివాహము – లోక కళ్యాణ దివ్య సంస్కారం: యెషయ 62:1-5; 1 కొరింథి 12:4-11; యోహాను 2:1-11 (C 2)

Saturday, 18 January 2025

కానా వివాహము – లోక కళ్యాణ దివ్య సంస్కారం: యెషయ 62:1-5; 1 కొరింథి 12:4-11; యోహాను 2:1-11 (C 2)

 


కానా వివాహము – లోక కళ్యాణ దివ్య సంస్కారం

యెషయ 62:1-5; 1 కొరింథి 12:4-11; యోహాను  2:1-11 (C 2)

మీ కళ్ళు ధన్యమైనవి, ఎందుకంటే అవి చూస్తున్నాయి (Divine Office)

 

దేవుని రక్షణను వివరించడానికి అద్భుతాలు, వివాహా విందులు, ‘ద్రాక్షా వల్లి రెమ్మలు’ వంటి సంకేతాలు మరియు చిహ్నాలు పరిశుద్ధ గ్రంథంలో చాలానే ఉన్నాయి. యోహాను సువార్తికుడు క్రీస్తు చూపించిన ‘సంకేతాల’ను మన కళ్ళు చూడ మించిన వాటి పరమార్ధాన్ని చూపే సంజ్ఞలుగా అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి అర్థం చేసుకోవడానికి మరియు నెరవేర్చడానికి అతను యేసును మనకు సమర్పించుకున్నాడు. కానా పల్లె వద్ద ‘నీటిని ద్రాక్షారసంగా మార్చడం’ అనే సంకేతం, యేసు మనకు అందించే “పరిపూర్ణ పరివర్తనాత్మక రక్షణను” మనకు తెస్తుంది. ప్రేమకు చిహ్నంగా ఓ పెళ్లి వేడుకలో ఈ సంకేతం జరిగింది. ఇది మానవులతో దేవుని నిశ్చయాత్మకమైన సహవాసాన్ని వ్యక్తీకరించడానికి పరిశుద్ధగ్రంథ సంప్రదాయంలో మనకు కనిపించే అత్యత్తమ ప్రతిమ. జీవితమంతా విచిత్రంగానూ దిక్కుతోచలేనంత అయోమయ స్థితిలో దిగాలుగా ఖాళీ అయిపోయింది   అనిపించినప్పుడు యేసు అనుచరులు తన మోక్షాన్ని  తప్పనిసరిగా వెతకి జీవించాలి మరియు దానిని ఇతరులకు అందించాలి. పాత నిబంధనలో 'ద్రాక్షా రసం' అనేది దేవుని బహుమతిగానూ  ఆశీర్వాదంగా పరిగణించబడింది (ద్వితీ 7:13; సామే 3:10, కీర్తన 105). యేసు మనకు తెచ్చే రక్షణ  మన జీవితంలో విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.


నేడు చాలా మంది క్రైస్తవ, అందునా కథోలిక విశ్వాసులు దేవాలయంలో జరిగే సాంఘిక దైవీక సంస్కారముల పరిచర్య అనేది జీవాన్ని ఇచ్చే సజీవ సంజ్ఞలుగా భావించడం లేదు. పరిగణించడంలేదు.  ప్రార్ధనా వేడుక వారికి ‘బోరింగ్‌’ అనిపిస్తుంది. అందుచేతనే మాతృ శ్రీసభ - జీవితంలోని బాధలు, క్రూరత్వాలను తగ్గించడానికి యేసు సామర్థ్యాన్ని కనుగొనాలని, అందునా ఆధ్యాత్మిక జీవితాన్ని ధృవీకరించే అర్చన సంస్కార సంకేతాలను మరియు చిహ్నాలను చూచి గ్రహించమని మనలను ఆహ్వానిస్తుంది. సంతోషకరమైన వార్తగా అనిపించని విషయాన్ని మరి ముఖ్యంగా రెండంచులు కలిగిన ఖడ్గంలాంటి వాక్యాన్ని నిష్పక్షపాతంగా బోధిస్తే ఈ రోజున ఎవరు వినాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు మన ఉనికికి కారణాన్ని, ప్రేమించే శక్తిని, సున్నితంగా ఆనందంగా, ఋజువర్తనంగా జీవించడానికి ఒక జీవనశైలిని మనకు అందించడానికి వచ్చాడు. నేడు విశ్వాసులు కేవలం సైద్ధాంతిక మతాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ఇష్ట పడుతున్నారే కాని, దేవుని ప్రేమకు వున్న నిజ అందాన్ని ఆరాధించలేకపోతు న్నారు. అందుచేతనే సత్య సభకు చాలా మంది దూరంగా ఉంటున్నారు.


వివాహ విందులో, యూదులు తమ శుద్ధీకరణకు ఉపయోగించే నీటిని కూజాలనుండి 'బయటకు తీసిన'ప్పుడు మాత్రమె ఆ నీటిని ద్రాక్షారసంగా రుచి చూడగలిగారు. నీటిలో నిగూఢమైయున్న జీవాత్మక రుచిని చూరగొనలేక పోయారు. మానవ శరీరధారి యేసులో నిక్షిప్తమైయున్న త్రిత్వ దైవత్వాన్ని మరి ఇంకేమి గ్రహించగలరు? శిలాఫలకాలపై రాసుకున్న ధర్మశాస్త్రం కొందరికి అరిగి కరిగి పోయినట్లుంది! మానవ అవసరాలను శుద్ధి చేసి సంతృప్తి పరచగల జీవజలమేదీ ఇక లేదని వారు భావిస్తున్నారు. “అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును”(2 కొరి 3:6). అందుచేతనే అక్షర రూపంలో ఉన్నధర్మ శాస్త్రం ఆత్మతో భర్తీ చేయబడింది. యేసు వ్యక్త పరచే ప్రేమ జీవితం ద్వారా “మతం” విముక్తి పొందాలి. మనలోనూ మరియు మన సోదరుల్లో పరివర్తన చెందుతున్న యేసు ప్రేమను తెలుసుకోవడానికి, కేవలం బోధనాత్మక మాటలు సరిపోవు. సంజ్ఞనాత్మక సేవలు మరియు చెడును ఖండించగలిగే ధార్మికత కూడా అవసరం.


యేసు సుందర ఆనందకరమైన శైలిని మన స్వంతం చేసుకోవాలి. కానా వివాహం అనే  పరలోక విందు వేడుకలో సమస్త జనావళిని స్వాగతించే ఆనందం మాదిరిగానే మన తిరుసభ కలిగియున్న వైఖరి ఎడల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం కూడా యేసు మానవత్వానికి దగ్గరవుతూ, ఆయనలోని మానవ స్వభావాన్ని మరింత లోతుగా తెలుసుకొని పొరుగు వారిని ప్రేమించేందుకు ప్రయత్నిస్తూ, ఆయన మాట వింటూ, విశ్వాసంలో వృద్ధి చెందుతూ, తండ్రి ముఖాన్నికుమార యేసులో చూసే వరకు పరిశుద్దాత్మన మనం ప్రయాసపడదాం. లోక కళ్యాణ విందులోని త్రిత్వై౦లో ప్రమోదం చెందుదాం.   

 

“మీ చెవులు ధన్యమైనవి, ఎందుకంటే అవి వింటున్నాయి” (Divine Office)

No comments:

Post a Comment