AletheiAnveshana: మనం దేవుడిని చూశాం: యెషయ 60:1-6; ఎఫేసి 3:2-3a,5-6; మత్త 2:1-12 (క్రీస్తు సాక్షాత్కారం C)

Saturday, 4 January 2025

మనం దేవుడిని చూశాం: యెషయ 60:1-6; ఎఫేసి 3:2-3a,5-6; మత్త 2:1-12 (క్రీస్తు సాక్షాత్కారం C)

 

మనం దేవుడిని చూశాం

యెషయ 60:1-6; ఎఫేసి 3:2-3a,5-6; మత్త 2:1-12 (క్రీస్తు సాక్షాత్కారం  C)

మనము వెళ్లి ఆయనను వెదకుదాము. మనం అతనికి బంగారము,  బోళము మరియు సుగంధ పరిమళాల బహుమతులను అందజేద్దాం” (Divine Office)

 

ఆంగ్ల పదం “ఎపిఫనీ” గ్రీకు పదం “ఎపిఫనీయ” అనే పదం నుండి వెలువడింది. తెలుగు భాష నందు "వ్యక్తీకరణ" లేదా “ సాక్షాత్కారము" అని అర్ధం. యేసును ఇజ్రాయేలు మెస్సీయగా, దేవుని కుమారుడుగా మరియు ప్రపంచ రక్షకునిగా చూపడం" అని ఈ మాటకు అర్థం. చారిత్రాత్మకంగా క్రీస్తు ప్రారంభ జీవితంలో మరియు తన పరిచర్య జీవిత క్షణాల్లో అనేక "ఎపిఫనీ"లను జరుపుకుంటాము. వీటిలో ప్రాముఖ్యంగా బెత్లెహేములో అతని జననం, జ్ఞానుల సందర్శన, బాప్తిస్మ యోహాను చేత ఆతని బాప్తిస్మము మరియు గలలీయలోని కానా పల్లెలో అతని మొదటి అద్భుతం (CCC 528).

 

తిరుసభ పితృ పాదులు జాను క్రిసోస్టముడు  బెత్లెహేము నక్షత్రపు ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరిస్తాడు. జ్ఞానులు బెత్లెహేము గమ్యాన్ని చేరుకునే వరకు ఆ నక్షత్రం పవిత్ర స్థలాన్ని ప్రకాశింపజేసింది అని వ్రాశాడు. తూర్పు నుండి దేవుని జ్ఞానం కోసం దాహంతోవచ్చిన జ్ఞానుల  నిజమైన జ్ఞాన మూలం యేసు క్రీస్తు!! దేవుని కాంతి జ్ఞానాన్ని వెతకడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టారు. వారు నవజాత రాజును కనుగొన్నప్పుడు  వినయంగా అతనిని వారు ఆరాధించారు. ఆ రాజు  శాంతి యువరాజు (యేష 9:6), రాజులకు రారాజు (ప్రకటన 19:16). అందుచేతనే ఆతనికి తగినటువంటి బహుమతులు ఇచ్చారు.


యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం ఆయనను తెలుసుకోలేదని మరియు ఆయన స్వంత ప్రజలే  ఆయనను స్వీకరించలేదని భక్త యోహాను సువార్తికుడు పేర్కొన్నాడు (యోహా 1:10-11). ఆ నిశి రాత్రిన జ్ఞానులు, మరి కొంతమంది గొర్రెల కాపరులు తప్ప ప్రపంచంలోని మిగిలిన వారందరూ అంధకారంలోనే వుండిపోయారు. యూదుల పెద్దలకు ఏమైంది? వాగ్ధాన ప్రవచనాలు కప్పివేయ బడ్డాయా? కానీ మనం మాత్దేరం వుడిని చూశాం (న్యాయాధి. 13:22; యోహా 14:9; యోహా 1:14). విశ్వాసం అనేది భగవంతుడు మనకు ఇచ్చే పూర్తి బహుమతి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి మరియు విశ్వసించడానికి హృదయం అనేది మనస్సు కళ్ళను తెరుస్తుంది. విశ్వాస జీవితంలో, మానవ సంకల్పం మరియు బుద్ధి అనేవి దేవుని దయతో సహకరించాలి కదా! అందుచేతనే పునీత థామస్ అక్వినాసు “మానవ బుద్ధిన విశ్వాస క్రియ అనేది దేవుని కృప చేత ప్రేరేపించబడిన సంకల్పంవల్ల దైవీక సత్యం వైపు చైతన్యం చేయబడే ఒక చర్య” అని అంటాడు.

 

జ్ఞానులు బహుకరించిన బహుమతుల అర్థం క్రీస్తు శాస్త్రము (క్రిస్టోలాజి)నకు అనుబంధముగా వుందని  అని మనము నమ్ముతున్నాము. యేసు, రాజు కాబట్టి దానికి ప్రతినిధిగా బంగారం సమర్పించబడింది. యాజకులు ఆలయంలో దేవునకు సాంబ్రాణి పదార్థాన్నిఅర్పిస్తారు. యేసు నిత్య శాశ్విత యాజకుడు కాబట్టి దానికి అణుగుణంగా సాంబ్రాణిని  సమర్పించారు. మరణించిన వారి దేహములకు సుగంధ పరిమళాలను పూస్తారు. యేసు క్రీస్తు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు. మానవ కళ్యాణార్ధం మరణించ బోతున్నాడని వేద జ్ఞానాన్ని గ్రహించిన తూర్పు జ్ఞానులు ముందుగానే ఆతని సమాధి సంసిద్ధత కొరకు ఉపయోగించే ఆ సుగంధ ద్రవ్యములను బహుకరించారు.

 

మరి మనము ఆతనికి ఏమి బహుహరించాలనుకుంటున్నాముయేసుక్రీస్తును కలుసుకోవడమంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం. యేసుతో జ్ఞానుల ముఖాముఖి సాక్షత్కారమున, యూదు ప్రజలకు మాత్రమె కాకుండా సర్వ ప్రజలకు తన ఏకైక కుమారుడిని రాజుగా రక్షకునిగా ఇవ్వాలనే దేవాధి దేవుని ప్రణాళికను చూస్తున్నాము. యూదులు మరియు అన్యజనులు ఇద్దరూ దేవునితో నిజమైన శాశ్వతమైన శాంతిని కనుగొనడానికి యేసు ప్రభువు వచ్చాడు. చివరిగా, బెత్లెహేము అను పదం రెండు హేబ్రియ పదాల కలియిక. బెత్ అంటే ఇల్లు అనీ, లేహెం అంటే రొట్టె అని అర్ధం. మొత్తంగా బెత్లెహేము అంటే “గృహ రొట్టె” అని అర్ధం. బెత్లెహేములో సాక్షాత్కారించిన యేసు సజీవ రొట్టె. నిత్య జీవమునకు ఆకలిని తీర్చే నిత్య జీవాహారం. యేసును విశ్వసించే మనము, విశ్వసించని వారందరూ ఆ “బెత్లెహేము”లోనే మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం కొనసాగాలని ప్రార్థిద్దాం.

 

మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నట్లే మనం నిజమైన దేవునిలో ఉన్నాము” (Divine Office)

No comments:

Post a Comment