మన శుద్ధి కోసం ఆయన జలాలను పవిత్రం చేశాడు
(యేష 40:1-5,9-11; తీతు 2:11-14; 3:4-7; లూకా 3:15-16,21-22 (యేసు బాప్తిస్మము – C)
“ఇదిగో దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలను మోసుకొనుపోవు
వ్యక్తిని చూడు" (Divine Office)
ఈ రోజు మనం ప్రభువు బాప్తిస్మపు పండుగను జరుపుకుంటున్నాము.
యేసు బాప్తిస్మము మూడు సారూప్య సువార్తలయిన మత్తయి,
మార్కు, లూకా లో నివేదించబడింది. యేసు స్వీకరించిన బాప్తిస్మ
సంస్కారము యేసులో నిక్షిప్తమైయున్న దేవుణ్ణి అభివ్యక్తిగా చూపెడుతుంది. ఇది మరొక ఎపిఫనీ లేదా దేవుని సాక్షాత్కారం. లూకా సువార్తలో
ప్రసాదించబడిన ఈ బాప్తిస్మ సన్నివేశంలో త్రిత్వైక సర్వేశ్వరుణ్ణి మనము
చూస్తున్నాము. వినిపించబడిన స్వరంలో తండ్రిదేవుడు, పావుర రూపమున ఆకాశ
మండలాల నుండి దిగివచ్చిన పవిత్రాత్మ దేవుడు, యోర్దాను నది జలంలో శరీరధారి వాక్కైన దేవుని
ఏకైక కుమార దేవుడు – త్రిత్వైక దేవుడుగా మనకు సాక్షాత్కరించడం గొప్ప వరం.
దేవుని కుమారుడు యేసు యోర్దాను నదీ జలాలో బాప్తిస్మం
తీసుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? ఈ సంస్కారం
దేవునకు అవసరమా? సృష్టి కర్త సృష్టి చేత సంస్కరింపబడతాడా?
పవిత్ర ప్రజలను నీరు శుద్ధి చేస్తుందా లేక మానవులను శుద్ధి చేయడానికి అతిపవిత్ర
జనుల ప్రవేశంతో నదీ జలాలు శుద్ధి చేయబడతాయా? తనచే యేసు బాప్తిస్మం తీసుకోకుండా బాప్తిస్మ యోహాను ఆపడానికి ప్రయత్నించాడు. “నేను మీ ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి. మీరు నా దగ్గరకు రావడం
ఏమిటి? అని వారించ బోయాడు యోహాను. అపుడు యేసు అతనితో, “ఇప్పుడు
ఇలా జరగనివ్వండి” (మత్త 3:14-15) అని నచ్చ జెప్పాడు. ఇటలీ దేశంలోని ట్యూరిను అను ప్రాంత పీఠాధిపతి అయిన పునీత
మాక్సిమసు ఈ సంభాషణను బాగా అర్థం చేసుకొని ఇలా వ్రాస్తున్నాడు: “యేసు క్రీస్తు
బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణం యోర్దాను
జలాల ద్వారా తాను పవిత్ర పరపబడడానికికాదు. కానీ అతను తాకిన నీరు అంతా మరియు భూమి
మీద నెలకొని యున్న నీటి నంతటిని శుద్ధి చేయడానికి యేసు యోర్దాను నదిలో దిగాడు.
రక్షకుడు నది నీటిని ఆ సమయాన తాకినపుడు సర్వ మానవాళి బాప్తిస్మం కోసం సర్వ జలాలు శుభ్రంగా తయారు చేయబడినాయి. భావి యుగాల ప్రజలకు బాప్తిస్మ కృపను అందించడం కోసం యేసు తన బాప్తిస్మ
సంస్కారం ద్వారా సర్వ జలాలను శుద్ధి చేసాడు.
ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయేలు బిడ్డలు వెడలినపుడు వారికి
ముందు అగ్ని స్తంభం వెళ్ళింది. తద్వారా
వారు వారి నిశి రాత్రి ప్రయాణంలో ధైర్యం పొందుకున్నారు. అదే విధంగా, బాప్తిస్మపు నీటి ద్వారా యేసును అనుసరించే వారికి
మార్గాన్ని సిద్ధం చేయు నిమిత్తం యేసు సత్య వెలుగు స్తంభమై మొదట యోర్దాను నదీ జలాల
గుండా వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల నిర్గమ సమయంలో అగ్ని స్తంభము వారికి కాంతిని అందించింది. ఇప్పుడు అది బాప్తిస్మపు
స్నానంలో మన విశ్వాసుల హృదయాలకు వెలుగునిస్తుంది. పాపమున మనము ఆదాము ఏవ పిల్లలము.
కానీ ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మరోసారి దేవుని బిడ్డలముగా రూపుదిద్దబడినాము. బాపిస్మము
అనేది జీవితకాల పిలుపుకు నాంది”(Divine
Office) అని నమ్మాడు.
బాప్తిస్మము పొందిన యేసు మనలను తన పోలికలో పునరుద్ధరించడానికి
తన చైతనాత్మక క్రియ అయిన పరిశుద్ధాత్మ
బహుమానం ద్వారా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అతను నీతి, శాంతి మరియు సంతోషాలను నెలకొల్పి అందించే తన రాజ్యానికి
మిషనరీలుగా మనలను అభిషేకించాడు (రోమా 14:17). మన
చుట్టూ ఉన్నవారికి ఆయన దయ మరియు మంచితనపు అందచందాలతో నిండిన సువాసనలను ప్రసరింపజేసే ఆతని
రాజ్యానికి మనము "వెలుగు మరియు ఉప్పు" అని మనలను పిలిచాడు (Mt 5:13,15-16). ఇతరులు పరిశుద్ధాత్మలో నూతన జీవితాన్ని, స్వేచ్ఛను ఆనందాన్ని పొందేలా తన ప్రేమ మరియు సత్యం మన
ద్వారా ప్రకాశించాలని ప్రభువైన యేసు కోరుకుంటున్నాడు. తిరుసభ పితృపాదులు గ్రెగొరీ
ఆఫ్ నజియాంజసు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తుతో పాటు ఉత్థాన మవ్వడానికి బాప్తిస్మము
ద్వారా మనం క్రీస్తుతో సమాధి చేయబడినాము. అతనితో లేపబడుటకు మనము అతనితో కలిసి మరణిద్దాము. అతనితో
పాటు మహిమపరచబడుటకు మనము కూడా ఆయనతోపాటు ఉత్థానమవుదాము".
నిబద్ధత కలిగిన క్రైస్తవుడు క్రీస్తు జీవితంలోని మన
భాగస్వామ్య క్రియాత్మక ప్రభావాలను నిర్ధారించగలడు. మనం ఆధ్యాత్మిక సజీవులం. మనము
దేవుని కుమార కుమార్తెలం. యేసు బాప్తిస్మ సమయంలో స్వర్గం నుండి వచ్చిన స్వరం, “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతనియందు
నేను సంతోషించుచున్నాను” అని యేసును గూర్చి చెప్పిన ఘనత యేసు ఆత్మలో జీవించే మనకు కూడా
దక్కుతుంది. ఇది నిజం. తధ్యం.
“ఇతను మనుషుల మధ్య దేవుని నివాస స్థలం. ఇతను మన మధ్య
నివసిస్తున్నాడు" (Divine Office)
No comments:
Post a Comment