AletheiAnveshana: దేవుని తల్లి : సంఖ్యా 6:22-27; గలతీ 4:4-7; లూకా 2:16-21

Tuesday, 31 December 2024

దేవుని తల్లి : సంఖ్యా 6:22-27; గలతీ 4:4-7; లూకా 2:16-21

 

దేవుని తల్లి

సంఖ్యా 6:22-27; గలతీ 4:4-7; లూకా 2:16-21

"నిన్ను సృష్టించిన దేవునకు నువ్వు జన్మనిచ్చావు. నువ్వు ఎప్పటికీ కన్యగానే  ఉన్నవు" (Divine Office)

 

పవిత్ర కన్య మరియ దేవుని తల్లి కాదు అని ప్రతి పాదించి బోధించిన నేస్తోరియను అను వేదాందితికి సరైన జవాబు ఇచ్చినదే ఎఫేసుసు మహాసభ. ఎఫేసుసు అను ప్రాంతం పూర్వ గ్రీసు ఆసియా మైనరు మరియు రోము సామ్రాజ్యపు భాగంగా వుండేది. ప్రస్తుతం టర్కీ దేశ భాగం. నేస్తోరియను సిద్దాంతమును తర్కించడానికి నాటి రోము చక్రవర్తి  రెండవ తెయోదోశియుసు ఆనాటి పోపు సేలేస్తియను (1) అనుమతితో  క్రీస్తు శకం 451 వ సంవత్సరం, జూను నేలలో ఎఫెసుసు నందు ఒక మహా సభను 197 పీఠాధి పతులతో ఏర్పాటు చేశాడు. అసమ్మతి సిద్ధాంతమును బోధించిన నేస్తోరియను మాత్రం హాజరు కాలేదని చరిత్ర చెపుతుంది. హాజరయిన పీఠాధిపతులందరు ఏకగ్రీవమున ఈ మహాసభనందు యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియను దేవుని తల్లి లేదా దేవమాత అని సగౌరముగా అంగీకరిస్తూ విశ్వాస నిర్దారణ చేశారు. దీనినే ఎఫేసుసు మహాసభ అని మన తిరుసభ పిలుస్తుంది. ఈ సభ  దేవుని తల్లి అన్న మాటను గ్రీకు భాషన థేయోటోకోస్ అని గంభీరంగా ప్రకటించబడింది. ఈ విశ్వాస ప్రకటన  మన కథోలిక సంప్రదాయంలో చిన్న భాగం.


ఈ గొప్ప థేయోటోకోస్ బిరుదుతో మరియ తల్లి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులచే గౌరవించబడుతోంది. ఆమె మాతృ సంరక్షణలో కొత్త సంవత్సర ప్రారంభమున మన ఆశలు  ప్రణాళికలను నెలకొల్పుకోవడానికి నేటి సాంఘిక పూజాబలి మనల్ని ఆహ్వానిస్తుంది. మన ఆందోళనలు మరియు మన యుగానికి సంబంధించిన సంఘర్షణలు, వెలుగు చూస్తున్న అన్యాయాలు మన ప్రపంచంలో శాంతిని మనము ఆమెకు అప్పగించవచ్చు.


తల్లి మరియ ప్రభువు దాసి. దేవుని కనికరంపై నమ్మకం ఉంచి, దేవుని మంచితనం ద్వారా నిలబడింది. వాస్తవానికి, ఆమె ప్రభువు ధన్యతను పొందుకున్నది. పాత నిబంధన హిబ్రూ భాషా పదం “అనావిమ్‌” అంటే యోహావాపై ఆధారపడు “దారిద్ర్యంలోని వారు” లేదా “కడు పేదవారు” అని అర్ధం. మరియ తల్లి దేవుని చేతిలోనే ప్రతిదీ ఉందని నమ్మకంగా విశ్వసించే వినయపూర్వకమైన దీనులందరిలో కల్లా ప్రత్యేకంగా నిలుస్తుంది (లూమెన్ జెంత్సియుం 55). పునీత అగస్టీను , "ఆమె తన కడుపులో యేసును గర్భం ధరించకముందే తన హృదయంలో గర్భం ధరించింది" అని అంటాడు, యోహాను సువార్త ఆమెను క్రీస్తు బహిరంగ జీవితం ప్రారంభంలో మరియు ముగింపులోను మాత్రమె చూపెడుతుంది. సువార్తికుడు యోహాను మాత్రమే కల్వరి వద్ద మరియ తల్లి ఉనికిని "యేసు శిలువ దగ్గర" (యోహా 19:25) వున్నట్లు గ్రంథస్తం చేసాడు.


యేసు చేసిన అద్భుతాలన్నీ చాలా మందికి భ్రమగా అనిపించినప్పటికీ, అతని తల్లి దేవుని శక్తిని విశ్వసిస్తూ అతని చివరి శ్వాస వరకు అతని చెంతనే మౌనంగా నిలబడింది. ఆమె విశ్వాసానికి ఆశ్చర్యపరిచే అద్భుతాలు మనకు అవసరం లేదు కానీ మన తండ్రి అయిన దేవుని మర్మమైన మార్గాలపై చిన్నపిల్లలకు కలిగిన నమ్మకంవలే ఆధారపడింది. యేసు యోహానుతో, “ఇదిగో నీ తల్లి” అంటూ తన  తల్లిని తనను అనుసరించే శిష్యులందరికీ మార్గదర్శక మూర్తిగా అనుగ్రహించాడు. ఆమె బలమైన మరియు సరళమైన విశ్వాసాన్ని మనతో పంచుకుంటుంది. మరియ తల్లి యేసు పుట్టిన సంఘటనలను అద్భుతంగా తన మదిన నిలుపుకున్నది. ఆమె తన హృదయంలో వాటిపై ధ్యానించింది. సర్వశక్తిమంతుడు తన కోసం మరియు ప్రజలందరికీ ఏమి చేసాడో ధ్యానించి౦ది. వినయపూర్వకమైన సాధారణ గొర్రెల కాపరులకు దూత, “ఈ రోజు దావీదు పట్టణంలో, మీకు రక్షకుడు జన్మించాడు. అతడు క్రీస్తు ప్రభువు” అన్న శుభవార్తను ఆమె తన హృదయంలో భద్రంగా పదిలపరచుకున్నది.


అదే సువార్త ఈరోజు మనకు ఇవ్వబడింది. మరయ తల్లి చేసినట్లుగా, దానిని నిధిగా పదిల పరచు కోవాడానికి, ధ్యానించడానికి మరియు దానికి ప్రతిస్పందించడానికి మనకు ఆహ్వానం అందించబడింది. ఈ రోజు, నూతన సంవత్సర ప్రారంభమున మనలో చాలా మంది మంచి తీర్మానాలు చేసుకోవడానికి ఇష్టపడే రోజు. దేవుని కృపకొరకు ప్రార్ధంచే ముందు మరియ వైఖరిని అవలంబించ కోరిక కంటే ఈ రోజు  నూతన సంవత్సర తీర్మానంలో మనం ఏమి కోరుకోగలం? ఈనాటి మన ఆరాధన మరియ తల్లి విస్మయ ఆశ్చర్య భావనలో పాలుపంచుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఆమె కుమారుడు నిత్యుడైన క్రీస్తులో దేవుని దయగల ప్రేమ ముందు మనము కొత్త సంవత్సరం వైపు కనులెత్తి చూస్తున్నప్పుడు, కన్య మరియ ద్వారా సువార్తను నిధిగా పొందడానికి మనకు సహాయం చేయమని మరియ తల్లిని అడుగుదాము. తద్వారా క్రీస్తు తన తల్లి ద్వారా మన వద్దకు వచ్చినట్లుగా మన మధ్యస్థ ప్రార్ధన ద్వారా ఆతను ఇతరుల దరికి వస్తాడు. అన్ని రకాల సంతోష ధుఃఖాల మధ్య కొత్త సంవత్సరం 2025లో ఆశ్చర్య ఉత్కంఠలతో మరియు విశ్వాసంతో ప్రవేప్రవేశించుదాము.

 

వాక్కు మరియ నుండి శరీరాన్ని తీసుకున్నప్పటికీ, త్రీత్వైకం పెరుగుదలలో గాని తగ్గుదలలో గాని మార్పు లేకుండా త్రిత్వంగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ పరిపూర్ణమైనది” (Divine Office)

 

No comments:

Post a Comment