" స్త్రీలలో
నీవు ఆశీర్వదింపబడినదానవు"
మీక 5:1-4; హెబ్రీ 10:5-10; లూకా 1:39-45 (ఆగమనం C 4)
“అప్పుడు మరియ యిట్లనెను నా ఆత్మ ప్రభువును
ఘనపరచుచున్నది”
క్రీస్తు జననమునకు ముందు ఈ చివరి ఆదివారం నాడు, మన సువార్త పఠనం క్రీస్తు జననానికి సాక్ష్యమివ్వడానికి
మనల్ని సిద్ధం చేస్తుంది. గాబ్రియేలు దూత సువార్తను ప్రకటించినప్పుడు, మరియ ఆ ప్రవచనాన్ని నమ్మింది. సందేశం ఎడల గట్టి నమ్మకాన్ని కలిగి ఉంది. అయితే యేసు పుట్టుక
గురించిన ప్రకటన తర్వాత మరియ చేసిన క్రియలను సువార్త పఠనం మనకు గుర్తుచేస్తుంది. మరియ
తన బంధువైన ఎలిజబెత్తును సందర్శించింది. ఆమె కూడా గర్భవతిగా ఉంది. ఆమెను దర్శించడానికి కొండ
ప్రాంతంలోకి వెళ్ళింది. మరియ రాక మరియు ఆమె కుమారుని ఉనికి చాలా ప్రభావాలను చూపుతున్నాయి.
మరియ పలుకులను విన్నవెంటనే ఎలిజబెత్తు గర్బంలో వున్న
శిశువు ఆనందంతో గంతులు వేయడం (లూకా 1:41) అదే సమయంలో ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయింది అని వాక్యం చెపుతుంది.
సువార్తికుడు లూకా ఈ సంఘటనను వ్రాస్తున్నప్పుడు తన పదాల
ఎంపికలో తాను తీసుకున్న జాగ్రత్తను గమనించండి! మొదట ఎలిజబెత్తు మరియ స్వరాన్నివిన్నది.
కానీ మరియ మాటలు “వినగానే” ఎలిజబెత్తు తన
గర్భంలోని కుమారుడు యోహాను దేవుని కృపా ప్రభావాలను అనుభవించాడు. ఆమె సహజంగా
వినినట్లు విన్నది కాని అతను మాత్రం అద్వితీయంగా గంతులు వేసాడు. ఆమె మరియ రాకను
గ్రహించింది. కానీ యోహాను మాత్రం దేవుని రాకడను గ్రహించాడు. స్త్రీలు దేవుని
కృపను గురించి మాట్లాడుకుంటే వారి గర్భాల్లోని తమ పిల్లలపై ఆత్మ పనిచేసింది. ఇది
తల్లులకు అర్థంకాని ఒక అద్వితీయ క్రియ. ఎలిజబెత్తు గర్భం దాల్చిన తర్వాత దేవుని ఆత్మను
పొందుకుంటే మరియ మాత్రం దేవదూత ప్రకటనతోనే గర్భం దాల్చింది.
అందుచేతనే, “స్త్రీలందరిలో
నీవు ధన్యురాలవు” (లూకా 1:42) అని ఎలిజబెత్తు
పలికినట్లుగా లూకా వ్రాస్తున్నాడు.
విని నమ్మిన మీరందరు ధన్యులు! వాక్యాన్ని విశ్వసించే ప్రతి ఆత్మ
కృపను గర్భం దాల్చిన ఆత్మయే! అటువంటి ఆత్మ దేవుని వాక్యానికి జన్మనిస్తుంది.
అలాంటి ఆత్మ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. శరీరానుసారంగా, ఒక స్త్రీ మాత్రమే క్రీస్తుకు తల్లి కావచ్చు, కానీ విశ్వాస ప్రపంచంలో, క్రీస్తు
మనందరికీ ఒక సజీవ ఫలం. ప్రతి ఆత్మ పవిత్రంగా నిరాడంబరతతో తనను తాను కాపాడుకుంటే
దేవుని వాక్యాన్ని స్వీకరించగలదు. ఈ స్థితికి చేరుకోగలిగిన ప్రతి ఆత్మ భగవంతుని
గొప్పతనానికి సాక్ష్య మిస్తుంది. ఫలిస్తుంది.
మానవ మాటల వల్ల ప్రభువు గొప్పతనం ఏమాత్రం అధికమవ్వదు. ఆత్మ
చేసే ప్రతీ మతపరమైన క్రియ మాత్రమే భగవంతుని ప్రతిరూపాన్ని పెంచగలదు. క్రీస్తు
దేవుని స్వరూపం. మానవ ఆత్మ దేవుని పోలికలో రూపుదిద్దుకుంది (ఆది 1:27). కాబట్టి, ఆ దేవుని గొప్పతనంలో ఆత్మకు కొంత భాగం ఉంది. ఈ
ఆగమన కాలంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత పాత్రను మనం పరిగణించడం సముచితం. మరియమాత
దేవుని వాక్యాన్ని విశ్వసించిన మొదటి శిష్యురాలు అని ఎలిజబెత్తు వర్ణించింది. మరియమాత
విశ్వాసం తన ప్రజల చరిత్రలో మరియు తన స్వంత జీవితంలో దేవుని పనిని గుర్తించేలా
చేసింది. దేవునిపట్ల ఆమె కలిగివున్న పావిత్రత ప్రతి ఒక్కరికీ దైవ మోక్షం వచ్చేలా
పని చేసింది (లూకా 1:38). దీని కారణంగా, మరియ
మాత తిరుసభ ప్రతీకగానూ మరియు చిహ్నంగానూ
వున్నది. మనము కుడా మరియ మాత ఆదర్శమున నడుద్దాం. మానవాళి రక్షణ కొరకు దేవుని
ప్రణాళికలో బహిరంగముగా సహకరించుదాము.
“యథార్థవంతులు దేవుని దయను చూసి సంతోషిస్తారు; వారు ప్రభువు ప్రేమను పొందుకుంటారు"
No comments:
Post a Comment