AletheiAnveshana: ప్రభువునందు శాంతియుతమైనవారు ధన్యులు (Nov. 1); (Nov 2) దైవ దర్శనానికై ఉత్తరించు ఆత్మలు

Friday, 1 November 2024

ప్రభువునందు శాంతియుతమైనవారు ధన్యులు (Nov. 1); (Nov 2) దైవ దర్శనానికై ఉత్తరించు ఆత్మలు



ప్రభువునందు శాంతియుతమైనవారు ధన్యులు


సకల పునీతుల పండుగ

Apo 7:2-4,9-14; 1 Jn 3:1-3; Mt 5:1-12a (Nov. 1/ /B)


 పరిశుద్ధులు పరలోక రాజ్యంలో నివసిస్తారు. వారి శాంతి శాశ్వతంగా ఉంటుంది. అల్లెలూయా” (Divine Office)

 

ప్రతీ సంవత్సరం, మాతృ శ్రీసభ ఎంపిక చేసిన పునీతుల ప్రార్థనను, సాక్షివంతమైన మరియు ఆదర్శప్రాయమైన వారి జీవితాన్ని మనము ఈరోజున స్మరించుకుంటాము. ఈ పునీతులు లేదా సాధువులు కేవలం తమ సుమాత్రుక జీవితం కంటే మిన్ననైన జీవితాన్ని కలిగి యుంటారు. మనము విశ్వాస సంగ్రహాన్ని జపించినపుడు అందులో వున్న ఒక వాక్యం “పునీతుల బాధవ్యం” అని ప్రార్దిస్తాము. అంటే వారితో మనకు కలిగిన బాంధవ్యం అని అర్ధం. వారు, మనము ఒకే కుటుంబ సభ్యులమైయున్నాము. నేటి సువార్తా ప్రబోధలనలోని అష్ట భాగ్యాలు మరియు ఆనందం ఇందుకు అద్దం పడుతున్నాయి. నేటి సువర్తా పఠనంలో, యేసు "ఆశీర్వదించబడినవారు" లేదా "సంతోషవంతులు" అని సూచించే వ్యక్తులలో ఎవరూ -మృదువైనవారుగానూ, అణచివేయబడినవారుగానూ లేదా ఆత్మలో పేదలైనవారుగా -ప్రపంచంలో ఎపుడూ, ఎక్కడా లేరని మనము స్పష్టముగా గమనించాము. పునీత పౌలు "ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము" (1 కొరిం. 3:19) అని చెప్పాడు. యేసు నేర్పించే జ్ఞానానందం – ప్రాపంచికి సంతోషం లేదా లోక తెలివితేటలకు భిన్నంగా వుంటుంది కదా !!!

 

యేసు “ధన్య” అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఆయన అర్థం ఏమిటి? అప్పుడప్పుడు దీనికి కలిగిన పర్యాయ పదాలైన "అనుకూలమైనది", “ఆశీర్వాదం”, “భాగ్యవంతం”, "సంతోషం" లేదా "అదృష్టవంతుడు" అన్న అర్ధాలను చెప్పుకోవచ్చు. అలాగునే పేదరికం, దుఃఖం మరియు హింసతో బాధపడేవారు దేవునిచే ఆశీర్వదించబడతారని యేసు పేర్కొన్నాడు. మన క్రైస్తవ జీవనానికి ధన్యులైన పునీతులను మార్గదర్శకాలుగా పరిగణించాలి. ఈ సువార్త పఠనాన్ని మనము సకల పునీతుల పండుగలో కూడా వింటాము. పునీతులు అంటే అష్ట భాగ్యాలను అనుసరించిన వారు. వారు యేసు జీవించిన బాటలోనే నడిచారు. ఈ రోజున ఆ ధన్య వాగ్దానాలను మరియు స్ఫూర్తికి అనుగుణంగా మన జీవితాలను జీవించడానికి మనకు ఒక సవాలు మన ఎదుట నిలుచుంది!!!

 

దైవ దర్శనానికై ఉత్తరించు ఆత్మలు

సకల ఆత్మల పండుగ  

యోబు 19:1,23-27a; 1 కొరింతి 15:51-57; యోహాను 5:24-29 (Nov. 2// B)

నువ్వు నన్ను భూమిలోని మట్టితో చేసావు; నువ్వు నాకు మాంసపు శరీరాన్ని ఇచ్చావు. ప్రభూ! చివరి రోజున నన్ను లేపుము" (Divine Office)


సకల ఆత్మల పండుగ సందర్భంగా, మరణించిన వారందరి ఆత్మల కోసం మనము ఈ రోజు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. నేటి దివ్యార్చానా పఠనాలు చనిపోయిన మరియు శాశ్వతమైన జీవిత పునరుత్థానంపై మనకు కలిగిన విశ్వాసంపై దృష్టి పెడుతున్నాయి. తిరుసభ సత్యోపదేశo ఇలా వివరిస్తుంది: “ఇంకా సంపూర్ణంగా శుద్ధి గావింపబడనటువంటి, దేవుని దయ మరియు స్నేహంలో మరణించిన వారందరూ, నిజంగా వారి శాశ్వతమైన మోక్షానికి చేరుకోవడానికి భరోసా ఇవ్వబడింది; కానీ మరణం తరువాత, వారు స్వర్గపు ఆనందంలోనికి ప్రవేశించడానికి అవసరమైన పవిత్రతను సాధించు  నిమిత్తం శుద్ధి గావింపబడతారు. ఎన్నుకోబడిన వారి ఈ చివరి శుద్ధీకరణ స్థలమునకు తిరుసభ ఉత్తరించు స్థలము (purgatory/ purgatorio) అనే పేరును ఇస్తుంది, ఇది హేయమైన శిక్షకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది (1030–31).


పదహారవ శతాబ్దపు కర్మేలు సభ పునీతుడు జాన్ ఆఫ్ ది క్రాస్ శుద్దీకరణ ప్రక్రియ గురించి విస్తృతంగా వ్రాశాడు. పరిపూర్ణత వైపు పయనించే ప్రయాణంలో ఆత్మ కలిగివుండే రెండు ప్రధాన శుద్ధీకరణలను గురించి వివరించాడు. మొదటిది - ఇంద్రియాల రాత్రి (the night of the senses). దీని ద్వారా ప్రతీ శారీరక ఇంద్రియo మరియు దాని ఆకలి లేదా దాని దాహార్తి శుద్ధి చేయబడుతుంది. రెండవది - ఆత్మ యొక్క రాత్రి (Dark night of the Soul). దీని ద్వారా బుద్ధి, (చెడు)జ్ఞాపకశక్తి (మహా భయంకరమైన రోగం) మరియు చిత్తం అనేవి సంపూర్ణంగా నిండుకొనియున్న పరిపూర్ణ విశ్వాసం, ఆశ మరియు దాతృత్వం చేత పూర్తిగా శుద్ధి చేయబడతాయి. మొదటి శుద్ధీకరణకు ముందు, ఆత్మ ప్రక్షాళన మార్గంలో ఉంటుంది. ఈ రెండు శుద్ధీకరణల మధ్య ఉండగా, ఆత్మ ప్రకాశించే మార్గంలో ఉంటుంది. రెండవ శుద్దీకరణను పూర్తి చేసిన తర్వాత, ఆత్మ ఏకీకృత మార్గం లేదా ఆధ్యాత్మిక వివాహంలోనికి (mystical marriage with God) ప్రవేశిస్తుంది.


ఈ రోజు మనం సకల ఆత్మల స్మారక కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు, చనిపోయి తుది శుద్ధి కొరకు తపించే ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రక్షాళన అనేది భగ భగ మండే మరియు శుద్ధి చేయ గలిగే ఆత్మీయ ప్రేమతో తనను ప్రేమించే వారి కోసం అందించే కృపా సంపన్నమైనటువంటిదే దేవుని చివరి దయ. మన పూజా ప్రార్థనలు అటువంటి వారి పట్ల దేవుని ప్రేమకృపా ద్వారాలు తెరచుకోవడానికి సహాయ పడతాయి!!


యేసు పునరుత్థానం అన్నది తనను విశ్వసించే వారందరికీ జీవనదాయకం. ఇది మనం కొనసాగిస్తున్న విశ్వాస వృత్తి. ఇది మన కోసం మరియు మరణించిన వారందరి నిత్యజీవం కోసం మన నిరీక్షణను ఆధారం చేసుకునేటటువంటి వాగ్దానం. తన మరణ పునరుత్థానం ద్వారా, యేసు తనను విశ్వసించే వారందరికొరకు మరణాన్ని జయించాడు. ఇందువలననే మరణించిన వారితో మనము ఇంకా మన సంబంధాన్ని పంచుకుంటూనే ఉన్నామని మనము నమ్ముతున్నాము. మరణించిన విశ్వాసుల ఆత్మల కోసం మనం ప్రార్థించినప్పుడు మన పూజా ప్రార్ధనా ఫలాలు ఆ బలహీనమైన ఆత్మలకు తోడ్పడి భగవంతుణ్ణి మొరపెట్టుకోవడానికి సహాయ పడతాయి. స్వర్గంలో నెల కొనివున్న నిత్యజీవం కోసం సిద్ధమవుతున్న ఆ ఆత్మలు ప్రక్షాళన లేదా ఉత్తరింపు ద్వారా శాశ్వత జీవితానికొరకు వారి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మరియు మోక్ష దైవ దర్శనాన్ని పొందుకోవడానికి సహాయపడతాయని తిరుసభ విశ్వసిస్తూ మనలను అదే విశ్వాసంలో బలపరుస్తుంది. ఈ దాతృత్వ/ సహాయక చర్య ద్వారా, మనం దేవుని దయను పొందుతాము. దేవుడు కూడా మహిమపరచబడతాడు. 


"నేనే పునరుత్థానం మరియు జీవం: నన్ను విశ్వసించేవాడు, అతను చనిపోయినప్పటికీ, అతను జీవించి ఉంటాడు." (Divine Office)

No comments:

Post a Comment