AletheiAnveshana: యేసు! మీలో దేవుణ్ణి చూసేందుకు నాకు సహాయం చేయండి: యిర్మియా 31:7-9; హెబ్రీ 5:1-6; మార్కు 10:46-52 (30 B)

Saturday, 26 October 2024

యేసు! మీలో దేవుణ్ణి చూసేందుకు నాకు సహాయం చేయండి: యిర్మియా 31:7-9; హెబ్రీ 5:1-6; మార్కు 10:46-52 (30 B)

 

యేసు! మీలో దేవుణ్ణి చూసేందుకు నాకు సహాయం చేయండి

యిర్మియా 31:7-9; హెబ్రీ 5:1-6; మార్కు 10:46-52 (30 B)

"మీ కళ్ళు ధన్యమైనవి, ఎందుకంటే అవి చూస్తున్నాయి" (Divine Office)

 

యేసు యెరూషలేములో విజయవంతమైన ప్రవేశానికి సిద్ధమవుతుండగా, తాను ఒక స్వస్థపరిచే వ్యక్తిగానూ, ఆతని కీర్తి తన పొరుగు ప్రాంతాలన్నింటిలో వ్యాపించింది. గ్రుడ్డివాడయిన బర్తిమయుడు కనికరం కోసం యేసును “నజరేయుడైన యేసు! నన్ను కరుణించు” అని అర్ధించాడు. చుట్టూ వున్న ప్రజలు తనను ఎంతగా వారించినా, యేసు వినలేదనుకొని బర్తిమయుడు పట్టుదలతో, యేసు, దావీదు కుమారుడా! నన్ను కరుణించు" అని మరింత బిగ్గరగా పిలిచాడు. యేసు దృష్టిని ఆకర్షించడానికి బర్తిమయినకు చాలా ధైర్యం మరియు పట్టుదల అవసరమయింది. మార్కు సువార్తలో సాధారణంగా యేసు స్వస్థత  కథలు గాని కార్యకలాపాలు గాని తన పలుకులతో ముడిపడి ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం  బర్తిమయిని విశ్వాసమే తనను రక్షించిందని యేసు చెప్తున్నాడు. అంటే యేసు స్వస్థతా శక్తి స్వస్థత కోసం వెతుకుతున్న వ్యక్తి విశ్వాసంతో సంబంధం కలిగి ఉంటుందని ఆతని బోధన.

నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు?” అని యేసు బర్తిమయిని ప్రశ్నించాడు. అందుకు అతను, “బోధకుడా! నాకు దృష్టిని కలుగజేయుము” అని కోరుకున్నాడు. “సర్వేoద్రి యానం నయనం ప్రధానం”. సర్వ ఇంద్రియాలలో కనులు అతి శ్రేష్ట మయినవి. భౌతిక దేహాన్ని నడిపించేది ఈ కనులే అయినప్పటికీ భగవంతుణ్ణి దర్శించుకోవడానికి భౌతిక కనులు కన్నా ఆంతరంగిక దృష్టి అతి ప్రాముఖ్యం కదా అని సర్వ వేదాలు ఘోషిస్తున్నాయి!

నేను చూడాలనుకుంటున్నాను” అన్న బర్తిమయిని అభ్యర్ధనతో (మార్కు 10:51) యేసు అతనికి భౌతిక దృష్టిని మాత్రమే ప్రసాదించాడు. కానీ, “నేను నీ కోసం ఏమి చేయాలనుకుంటున్నావు?" అని అడిగిన ప్రశ్న బర్తిమయినితో పాటు తన చుట్టుప్రక్కల ఉన్న వారినందరినీ ఉద్దేశించి అడిగిన ప్రశ్నే! ఈ రోజు నిన్ను నన్ను తాను అడుగుతున్న ఒక  గద్దింపు ప్రశ్న! శ్రీసభ పితృపాదులైన అలెగ్జాండ్రియా క్లమెంటు “స్వస్థపరిచగలిగే తన శక్తిపై విశ్వాసం మరియు విశ్వాసంలో వున్న వ్యక్తిగత ప్రతిస్పందనను మననుండి బయటకు తీసుకురావాలని యేసు కోరుకుంటున్నాడు. మేఘంలాగా మన కళ్లను హృదయాన్ని చీకటి చేసే అజ్ఞానాన్ని విస్మరిద్దాం. అంధకారాన్ని పోగొట్టి, నిజంగా దేవుడెవరాని ఆలోచించుకుందాం” అని తన ప్రతుల్లో వ్రాశాడు. మనకు అంతర్గత దృష్టి లేదా ఆధ్యాత్మిక దృష్టి భగవంతుని దయ ద్వారా తెరవబడాలి. ముఖ్యంగా, దేవుని యొక్క అంతర్గత దృష్టి అయినటువంటిదే ఈ అమూల్య విశ్వాసం!

గ్రుడ్డి బర్తిమయి పొందుకున్న ఈ అద్భుతం దేవుడు తన ప్రియమైనవారితో ఎలా సంభాషిస్తాడో తెలుపుతుంది. ఎవరెంత గద్దించినా బర్తిమయ యేసు దృష్టిని మాత్రమే ఆకర్షించాలని నిశ్చయించుకున్నాడు కదా! యేసు అతనిని విస్మరించి ఉండవచ్చు. కానీ మాటలకంటే చేతలే  ముఖ్యమని చూపించాడు. డ్రైవింగ్ రోడ్ టెస్ట్‌ సమయంలో కళ్లు కదిలిస్తూ, ప్రక్కవారితో మాట్లాడుతూ చుట్టుప్రక్కల వాహనాలను గమనించడం కంటే తలతిప్పుతూ వాహనపు అద్దాలలోనూ, వెనుక ముందు గమనించడం చాలా ముఖ్యమని నా డ్రైవింగ్ స్కూలు ఇన్‌స్ట్రక్టర్ చెప్పాడు. అంటే కేవలం మాటలు, చూపులు మాత్రమే కాకుండా శరీరమంతా చైతన్య వంతమైన ఏకాగ్రతను కలిగి వుండాలని అర్ధం. అలాగునే ప్రార్థనతో పాటు విశ్వాస క్రియలు కూడా త్రికరణ శుద్ధిని కలిగి ఉండడం మరింత ముఖ్యo. బర్తిమయి తీరని అవసరంలో ఉన్నాడు. మరియు యేసు అతని అవసరానికి ప్రతిస్పందించడానికి సిద్ధంగానూ ఉన్నాడు. అతని బాధలకు సానుభూతి చూపడం మాత్రమే కాకుండా, ఆ బాధల నుండి ఉపశమనం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. భక్త పౌలుడు “దేవదూతల భాష మాట్లాడటం కంటే ప్రేమ గొప్పది” అని చెప్తున్నాడు కదా (1 కొరిం. 13)!!

ఈ రోజు మన పోరాటాలలో ఆయన సహాయహస్తాన్ని చూడలేకపోతే, “ప్రభూ! నా విశ్వాసాన్ని పెంపొందించండి” అని అర్ధిద్దాం. మన శత్రువులలో మనం ఆయనను చూడలేకపోతే, “ప్రభూ! నా నమ్మకాన్ని ఆదరించండి” అని ప్రార్థిద్దాం. మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఎవరైనా ప్రాపంచిక ఆకర్షణల సముద్రంలో మునిగిపోతే, వారి కతోలిక లేక క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరించడం మానివేస్తే, యేసు ప్రభువా! నిన్ను చూసేందుకు వారికి సహాయం చేయండి అని ప్రార్థిద్దాం. ముఖ్యంగా తనలో భగవంతుణ్ణి దర్శించుకోవడానికి సహాయం అడుగుదాం. మన రక్షకుడు చాలా ఉదారంగా స్పందిస్తారు.

"మా చెడు గతించినదని, మా అసమ్మతి పరిష్కరించబడిందని, మా పాపాలు క్షమించబడినవని మిమ్ము దర్శించుకోవడానికి మాకు సహాయం చేయండి" (Divine Office).

No comments:

Post a Comment