AletheiAnveshana: పసి బిడ్డల మనస్సు వలే.......... జ్ఞాన 2:12,17-20; యాకోబు 3:16—4:3; మార్కు 9:30-37

Saturday, 21 September 2024

పసి బిడ్డల మనస్సు వలే.......... జ్ఞాన 2:12,17-20; యాకోబు 3:16—4:3; మార్కు 9:30-37

 

పసి బిడ్డల మనస్సు వలే..........

జ్ఞాన 2:12,17-20; యాకోబు 3:16—4:3; మార్కు 9:30-37

“నేను అన్ని రకాల వారికి ప్రతిగా మారాను, తద్వారా నేను వారిని రక్షించగలను” (DO)

దేవుని రాజ్యంలో నిజంగా ఎవరు గొప్పవారో తన శిష్యులకు చూపించడానికి యేసు ఒక పిల్లవాడిని కౌగిలించుకుంటూ నాటకీయమైన ఒక సంజ్ఞను చేశాడు. ప్రాచీన ప్రపంచంలో పిల్లలకు వారికంటూ స్వంత హక్కులు, సంఘంలో ఒక స్థానం గానీ, అధికారాలు లేవు. అటువంటి చిన్న పిల్లవాడు తన గొప్పతనం గురించి మనకు ఏమి చెప్పగలడు? అటువంటప్పుడు ఈ సంజ్ఞకు అర్ధం ఏమిటి?

అపోస్తలులు యేసు శిష్యగణంలో భాగమై ఉండడం వల్ల తమకు ఆధిక్యత, హోదా, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని భావించారు. వారు అధికారం కోరుకున్నారు. ఇది స్వీయ-కేంద్రీకృత, స్వార్ధ ఆశయం. యాకోబు ఇలా అంటాడు, "మీరు సంతృప్తి చెందలేని ఆశయాన్ని కలిగి ఉన్నారు, కాబట్టి బలవంతంగా మీరు దానిని సాధించు కోవడానికి పోరాడుతున్నారు". యాకోబు యేసు బోధనను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టే దానిని “పైనుండి దిగివచ్చే జ్ఞానం” అని సంబోధించాడు. ఇది భగవంతుని ఆశయం. సేవ చేయాలనే ఆశయం. అగ్ర స్థానంలో ఉండాలనుకునే వారు తమను తాము అందరికీ సేవకునిగా మలచుకోవాలి. మన ఆశయాలన్నీ ఆ భగవంతుని ప్రేరేపిత ఆశయానికి లోబడి ఉండాలి. సమాజంలో పెద్దలపై పూర్తిగా ఆధారపడే పిల్లలవలె సూచించబడే అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంలో తమకు సహాయం చేయలేని వారికి సేవ చేయడమే మన ఆశయంగా ఉండాలి.

నిజానికి మనం అత్యంత దుర్బలమైన వారికి సేవ చేయడంలో ఆయనకు సేవ చేస్తున్నామని యేసు తన శిష్యులకు మరియు మనకు భరోసా ఇస్తూనే ఉన్నాడు. యేసు తనను తాను ప్రాపంచిక అధికారిక  శక్తిహీనునిగా గుర్తించుకుంటాడు. ఆతనికి ప్రధానమైన విషయం లోక విజయం కాదు, సేవ చేయడం మాత్రమే. గొప్పతనం అనేది జ్ఞాని యొక్క తెలివి తనంలో ఉండేది కాదు. అది పిల్లల రుజువర్తన మనస్తత్వoలో ఉంటుంది. థామస్ కెంపిస్ ఇలా అంటాడు, “మీరు మొత్తం బైబిల్‌ను కంటితం చేయగలిగినా, తత్వవేత్తల బోధనలన్నింటినీ తెలుసుకన్నా, దేవుని దయ, ప్రేమ లేకుండా ఇది మీకు ఎలా సహాయపడుతుంది?” తెలివైన వ్యక్తితో పరిచయం కలిగి వుండడం ద్వారా మనం పరపతిని పొందుకుంటాము. నిరుపేదలకు సేవ చేయడం ద్వారా, మనం దేవుణ్ణి కౌగిలించుకుంటాము, మనం ఆయన ద్వారా శుద్ధి చేయబడతాము. దైవీకరింపబడతాము.

దేవుడు మనలను తన మహిమతో నింపాలని కోరుకుంటున్నాడు. అతను గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు కృపను ఇస్తాడు (లూకా 1:52; యాకోబు 4:6). మనము దేవుని జీవము మరియు శక్తితో నింపబడాలంటే, అడ్డుగా ఉన్న అహంకారం, స్వయ కీర్తి మొదలైనవాటిని మనమే ఖాళీ చేసుకోవాలి. దేవుడు ఖాళీ హృదయాలను కోరుకుంటాడు కాబట్టి అతను వాటిని తన శక్తి ప్రేమ మరియు కీర్తితో నింపగలడు (2 కొరి 4:7). యేసు ఆశించినట్లు సేవ చేయడానికి మనల్ని మనం తగ్గించుకోవడానికి సిద్ధమా? కొన్నిసార్లు మన దయా వినయాలు బలహీనతగా పరిగణింపబడవచ్చు. ఇది బలహీనత కాదు కానీ అది మనం పొందుకొనే అత్యున్నత ఆధ్యాత్మిక శ్రేణి.

మదర్ థేరేసా ఇలా అన్నారు, “ప్రజలు తరచుగా అసమంజసంగా, అహేతుకంగా స్వార్థపూరితంగా ఉంటారు. వారిని ఎలాగైనా క్షమించండి. మీరు దయతో ఉంటే, ప్రజలు మిమ్మల్ని స్వార్థపూరితమైన, నిగూఢమైన ఉద్దేశ్యాలతో నిందించవచ్చు. అయినా దయగా ఉండండి. మీరు విజయవంతమైతే, మీరు కొంతమంది నమ్మకద్రోహ స్నేహితులను మరియు కొంతమంది నిజమైన శత్రువులను గెలుచుకుంటారు. అయినప్పటికీ విజయం సాధించండి. మీరు నిజాయితీగా ఉంటే, ప్రజలు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఏమైనప్పటికీ నిజాయితీగా ఉండండి. మీరు సంవత్సరాల తరబడి సృష్టించే వాటిని ఇతరులు రాత్రిపూట నాశనం చేయగలరు. ఏమైనప్పటికీ సృష్టించండి. మీరు ప్రశాంత ఆనందాన్ని కనుగొంటే, కొందరు అసూయపడవచ్చు. ఎలాగైనా సంతోషంగా ఉండండి. ఈరోజు మీరు చేసిన మేలు తరచుగా మరువ బడుతుంది. అయినప్పటికీ మంచి చేయండి. మీ వద్ద ఉన్న ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. అది ఎప్పటికీ సరిపోదు. ఏది ఏమైనా మీ బెస్ట్ ఇవ్వండి. చివరిగా, ఇది మీకు, దేవునికి మధ్య మాత్రమే వుంటుంది కానీ అది మీకు మిమ్ములను బాధించే వారికీ మధ్య ఎప్పుడూ వుండదు."

"నేను సువార్త కొరకు, దానిని ప్రకటించడంలో నా వంతు పాలుపంచుకోవడానికి ఇదంతా చేస్తున్నాను" (DO)

No comments:

Post a Comment