రహస్య పూర్ణమైన దేవుని క్రియాత్మ
సంఖ్యా 11:25-29; యాకోబు 5:1-6; మార్కు
9:38-43,45,47-48 (26 B)
"... మీరు దయ ద్వారా రక్షింపబడ్డారు, కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని చిత్తం ద్వారా" (దైవార్చన ప్రార్ధన DO)
కథోలిక శ్రీసభ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా
క్రీస్తుకు నమ్మకంగా ఉన్న అసలైన క్రైస్తవ చర్చి. ఇతర విశ్వాస సంఘాలలో కూడా క్రియాశీలి
అయిన దేవుని ఆత్మను చూస్తున్నాము. యేసుక్రీస్తును నమ్మని వారు దేవుడు ఒక్కడే అని
ప్రగాఢ విశ్వాసంతో నిండిన వ్యక్తులు ఆ దేవుని కోసం జీవిస్తూ ఆయన కొరకే సేవ చేస్తున్నామని
నమ్మే చాలా మంది వ్యక్తులు - పేద, అనారోగ్య నిర్భాగ్యులకు సేవ చేయడంలో ఆ దేవుని
ఆత్మ శక్తిని పొందుకుంటున్నారు. లూథరు మతస్తుడైన డైట్రిష్ బోయెన్‌హాఫర్, హిందువైన
మహాత్మా గాంధీ, యూదుడైన మార్టిన్ బుబెర్, బిల్లీ గ్రహం మరియు R.R. K. మూర్తి వంటి వివిధ ఆధ్యాత్మిక నాయకులను కుడా మనము
చూస్తున్నాము. అలాగునే మాతృ తిరుసభ ఏడు దివ్య సంస్కారముల ఎడల
భాగస్వామ్యం లేని సంఘాలలో కూడా దేవుని ఆత్మ పరిపూర్ణంగా పనిచేయడం చూస్తున్నాము. వీరిలోని
సర్వోన్నత దేవుని ఆత్మ యేసు స్థాపిత కథోలిక సంఘ బోధన వైపు మళ్ళిస్తుందని తిరుసభ
నమ్ముతుంది. పరిశుద్ధ గ్రంధ పరంగా ఈ సత్యాన్ని ఎలా నమ్మగలం?
ఎల్దాదు మరియు మేదాదు దేవుని గుడారములో లేరు. మోషే కాలంలో దేవుని ఆత్మను పొందిన 70 మందితో వారు లేరు. అయినప్పటికీ, ఎల్దాదు మరియు మేదాదు ఆత్మను పొందుకున్నారు. అప్పుడు మోషేతో "వారిని ఆపు" అన్నాడు జాషువా. అందుకు మోషే, “యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక” అని జవాబిచ్చాడు (సంఖ్యా 11:29). యేసు పరిచర్య రోజుల్లో, శిష్య గణంలో లేని ఒక వ్యక్తి యేసు నామంలో బాప్తిస్మం ఇవ్వడం శిష్యులకు ఈర్శ్య కలిగించింది. అతను పన్నెండు మందిలో ఒకడు కాదు. బహుశా అతను యేసు మాట్లాడటం విని, సువార్తను వ్యాప్తి చేయాలని కోరుకున్నాడెమో! “అతన్ని ఆపండి” అని యోహాను యేసుతో వాపోయాడు. అందుకు యేసు "అతన్ని ఆపవద్దు ... మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షమే" (మార్కు 9:40) అని జవాబిచ్చాడు.
తిరుసభ పితృ పాదుడు గ్రెగొరీ ఆఫ్ నిస్సా (క్రీ.శ. 330-395) ఇలా వ్రాశాడు, “దేవుడు తన సేవకులను అసాధ్యమైన వాటిని చేయమని ఎప్పుడూ అడగడు. తన అద్వితీయ ప్రేమ మరియు మంచితనం తన సేవకులకు సమృద్ధిగా అందుబాటులో ఉండేటట్లు చేశాడు. అందరిపై తన కృపను నీళ్లలా కుమ్మరిస్తాడు. ఏదైనా మంచి చేసే సామర్థ్యాన్ని దేవుడు తన ఇష్టానుసారంగా ప్రతి వ్యక్తికి సమకూరుస్తాడు."ఇతరులు చేసే సత్రియలను చూసి మనం సంతోషిస్తున్నామా లేక అసూయా పడుతున్నామా? తమ సాంగత్యం లేని వ్యక్తి ఏసుక్రీస్తు నామంలో మంచి పని చేస్తున్నాడంటూ వాపోయారు శిష్యులు. యేసు తన శిష్యుల అసూయ, అనుమానాలను గురించి మందలించాడు. మనకంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నట్లు అనిపించే ఇతరుల మంచి పనులకు మనం బాధపడినప్పుడు మనం కూడా యేసు మందలించే తన శిష్యులాంటి వాళ్ళమేగా? భక్త పౌలుడు “ప్రేమ దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును (1 కొరింథీ 13:4,6) అని మనలను వారిస్తున్నాడు.
దేవుని ఆత్మయుగంలో జీవించడానికి మనం అనుగ్రహించబడ్డాము.
అతను మంచి వ్యక్తులందరి హృదయాలలో పని చేయడం ద్వారా ప్రపంచాన్ని మారుస్తున్నాడు.
అందువలన, “ఆధునిక ప్రపంచంలో తిరుసభ” (“The Church in
the Modern World” వాటికన్ II) అనే తిరుసభ విశ్వ లేఖ “దేవుని ఆత్మకు వినతులయ్యే వారందరూ, తమ మనస్సాక్షిని అనుసరించే వారందరూ, వాస్తవానికి, యేసుక్రీస్తుచే రక్షించబడిన తిరుసభ సభ్యులు” అని ప్రకటించింది.
ఎల్దాదు మరియు మేదాదు దేవుని గుడారమందు ఉండకపోవచ్చు, యేసు నామంలో
బాప్తిస్మం అనుగ్రహిస్తున్న వ్యక్తి శిష్యులలో ఒకరుగా కాకపోవచ్చు, అయినప్పటికీ, దేవుని ఆత్మ వారిని బలపరిచింది. దీని నుండి మనం ఏమి
నేర్చుకుంటున్నాము? సంవత్సరాల తరబడి దేవాలయమునకు, సంఘమునకు దూరంగా
ఉన్న వ్యక్తులు మళ్ళి దేవుణ్ణి కలుసుకొనే శక్తిని
ఆ ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే దేవునకు దూరంగా ఉన్న కాలంలో నిరంతరం
క్షమాపణ కోసం అర్దించే వారి హృదయ రహస్య గుహలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు
ఆత్మ వారికి జీవితంలోని అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. పునీత అగుస్తిను
వలే "నేను నిన్ను ఆలస్యంగా
ప్రేమించాను" అని వారు దుఃఖిస్తారు. దేవుడు తమను ప్రేమించడం ఎప్పటికీ ఆపలేడని తెలుసుకుంటారు. వారే
భగవంతుని కృపకు వాహినిగా కూడా మారతారని గ్రహించుదాము.
“..మీలో ఈ మంచి పనిని ప్రారంభించిన దేవుడు, అది క్రీస్తు దినంలో పూర్తయ్యే వరకు కొనసాగిస్తాడు.” (దైవార్చన
ప్రార్ధన Divine Office)