AletheiAnveshana: భగవంతునిగా మార్చే వ్యక్తిత్వం: ద్వితీ 4:1-2,6-8; యాకోబు 1:17-18,21b-22,27; మార్కు 7:1-8,14-15,21-23 (B 22)

Saturday 31 August 2024

భగవంతునిగా మార్చే వ్యక్తిత్వం: ద్వితీ 4:1-2,6-8; యాకోబు 1:17-18,21b-22,27; మార్కు 7:1-8,14-15,21-23 (B 22)

 

భగవంతునిగా మార్చే వ్యక్తిత్వం 

ద్వితీ  4:1-2,6-8; యాకోబు 1:17-18,21b-22,27; మార్కు 7:1-8,14-15,21-23 (B 22)

దేవుడు తాను చేసినదంతా చూశాడు, నిజానికి అది చాలా బాగుంది. అల్లెలూయా.” (DO) 

అర్చన కాలం ప్రకారం ఈ సంవత్సరం (బి) మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాము. కాని గత కొన్ని ఆదివారములుగా యోహాను సువార్త నుండి “జీవాహారం” గురించిన సువిశేష పఠనాలను తిరుసభ మనకు అందించిది. ఈ ఆదివారపు సువిశేషం నుండి మళ్లి మార్కు సువార్తవైపు తిరుసభ మనలను  నడిపించడం గమనిస్తున్నాము. ఈనాటి మార్కు సువిశేషంలో సువార్తీకుడు యూదుల ఆచారాలపై  ఎటువంటి జ్ఞానం, అనుభవం లేని అన్యులైన తన క్రైస్తవ సంఘస్తులకు ద్వితీయోపదేశ మరియు లేవీయకాండ చట్టాలను గురించి తెలియ చేస్తున్నాడు. అటువంటి చట్ట సంప్రదాయాలను పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రానికి మించి పాటిస్తున్నారనీ, పాటించమని వేధిస్తున్నారని యేసు విమర్శిస్తున్నట్లు మార్కు తెలియచేస్తున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులను దేవునితో ముడిపెట్టింది ధర్మశాస్త్రమే కదా!! మతం చట్టాన్ని పాటించాలి. రెలిజియన్ (మతం) అనే పదం లాటిన్ పదం లిగారే నుండి వచ్చింది. లిగారే అంటే "ఏదో ఒకదానితో లేదా ఎవరితోనైనా ముడిపడి ఉండడం" అని అర్థం.

చట్ట సంప్రదాయాల విషయంలో పరిసయ్యులు దేవుణ్ణి గౌరవించే మార్గంగా కాకుండా ఇతరులపై దాడి చేయడానికి మాత్రమే సంప్రదాయ చట్టాలను ఉపయోగించారు. ప్రజలు భారమైన శాసనాలను అనుసరించలేకపోయారు. అందువల్ల వారు పరిసయ్యుల చేత ఖండింపబడ్డారు. అందుకే యేసు, “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి" (యెహే 33:31; యేష 29:13) అని హెచ్చరించాడు. అటువంటప్పుడు మతం అంటే ఏమిటి? ప్రజలు దేవునితో ఎలా ముడిపడి ఉండాలి? యాకోబు తన పత్రికలో ఈ ప్రశ్నకు, “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే” (యాకోబు 1:27) అని  సమాధానమిచ్చాడు. మన సమాజంలో అటువంటి బలహీనులు ఎవరు?

బాధలలో వున్న అనాథలు మరియు వితంతువులు; శారీరక, మానసిక వికలాంగులు; అశ్లీల చిత్ర   పరిశ్రమకు బలైపోతున్న పిల్లలు, యువత; లింగ గుర్తింపు కొరకు పోరాడుతున్న వ్యక్తు,లు; కుటుంబాలను పోషించుకోవడానికి తమ స్వస్థలాలను విడిచిపెట్టిన వలస బ్రతుకులు; చాలీచాలని వేతనాలకు గురైన  నిరాశ్రయులు; లేమి కారణంగా గొంతు విప్పలేని అభాగ్యులు; కనీస అవసరతలు గడవలేక అమ్ముడుబడ్డ నిట్టూర్పు బ్రతుకులు; సైబర్ క్రైంలో బలైపోతున్న అమాయకులవంటి వారు బలహినులుగా పరిగణించబడతారు. మీరు, నేను మన చుట్టూ ఉన్న అటువంటి దుర్బలత్వాన్ని గుర్తించగలమా? మనచుట్టూ ఎలాంటి దుర్బలత్వం కన్పిస్తుంది? మనం మతస్థులమా? మనం దేవుడితో ముడిపడి ఉన్నామా? నిజమే  మనం దేవుడితోనే ముడిపడి ఉన్నాం!!!

నేటి సువార్త పఠనం ముగింపులో, యేసు ఒక వ్యక్తిని మరియు మతాన్ని మరియు మతపరమైన జీవితాన్ని అపవిత్రం చేసేటటు వంటి విషయాల గురించి హెచ్చరించాడు. అలాగునే దేవుని దరికి చేర్చే  విషయాలను కూడా గుర్తు చేస్తున్నాడు. సత్యం, అందం, ప్రేమ మరియు భగవంతుని కోసం జీవించాలనే సంకల్ప తపన వంటి సద్గుణాలు నిజంగా ఒక వ్యక్తిలో నాటబడిన దేవుని దయా బహుమానాలే. ఒక వ్యక్తి, నిజాయితీగా, దయతో, సానుభూతితో ఉదారంగా ఉన్నప్పుడు వారు తమ మత ఉనికిని చూపుతారు. ఈ విలువలను నిధిగా కాపాడుకోవడం ద్వారా మనం భగవంతుని సన్నిధిని విలువైనదిగా పరిగణిస్తాము. దానిని విలువైనదిగా కాపాడుకోవడం ద్వారా మనం ఇతరులలో దేవుని ఉనికి సన్నిధిని చూడగలం. స్వచ్ఛమైన, నిష్కళంకమైన మతం, మత జీవితం అంటే బలహీనుల పట్ల శ్రద్ధ కలిగి వుండడమే కదా నిజమైన క్రైస్తవ్యం.

క్రైస్తవుల చిహ్నం శిలువ. సిలువ త్యాగం ప్రేమను గుర్తు చేస్తుంది. మన అంతర్గత వైఖరిని మనం నిశితంగా పరిశీలించడం మనకు చాలా అవసరం. మనం పవిత్రులమని చూపించుకోవాలనే మన కోరికలో, బాహ్యమైన ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ, వాటికి కూడా మనం విశ్వసనీయతను ఇవ్వవచ్చు!! అయినప్పటికీ, యేసు మాటలు మనకు సవాలుగా నిలుస్తున్నాయి. కేవలం మన బాహ్య చర్యల ద్వారా మాత్రమె మనల్ని మనం పవిత్రం చేసుకోలేమని కూడా ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. బదులుగా, దేవుని ఆత్మ మనలను మార్చడానికి అనుమతించినప్పుడు మాత్రమె మనం పవిత్రులం అవుతాము. మన ఆచార సంప్రదాయాలు, పారదర్శక చర్యలు మనతో జీవించే అభాగ్యులను మెరుగు పరుస్తూ మన హృదయాన్ని భగవంతునిగా మార్చడానికి వ్యక్తీకరణగా ఉండాలన్నది నేటి అర్చన సారాంశం.

ప్రభువు మీకు ఇచ్చిన ఈ సంప్రదాయాలను వినండి మరియు అర్థం చేసుకోండి." (DO)

 

1 comment: