లెమ్ము! యేసులో
పరలోక తండ్రిని చూడు
యెహోషువ 5:9a.10-12; 2 కొరింథీ 5:17-21; లూకా 15:1-3.11-32 (Lent 4/C)
“దేవునికి భయపడేవారందరూ వచ్చి వినండి. ఆయన నా ఆత్మ కోసం ఏమి
చేసాడో నేను చెబుతాను” (Divine Office)
ఈ ఆదివారమును
“లేతరే” ఆదివారంగా పిలుస్తుంది మాతృ శ్రీసభ. లతీను పదం “లేతరే” అంటే “సంతోషించు” అని అర్ధం. ఈ లెంట్ నాల్గవ
ఆదివారపు అర్చన “తప్పిపోయిన కుమారుని’ ఉపమానమును ధ్యానిస్తుంది. దీనితోపాటు ఇంకా
రెండు ఉపమానాలు నేటి సువార్తలో కన్పిస్తాయి. ఈ మూడు ఉపమానాలను “తప్పిపోయిన” అను
శీర్షికన ఉపమానాలుగా పిలుస్తాడు లూకా గ్రంథ కర్త. మొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె దయనీయమైన
మూర్ఖత్వాన్ని వర్ణిస్తుంది. రెండవ ఉపమానం తప్పిపోయిన నాణెపు దౌర్భాగ్య
స్వీయ-అధోకరణాన్ని చిత్రీకరిస్తుంది. ఇక మూడవది కృతజ్ఞత లేని దుడుకు తనమును
చూపుతుంది. తప్పిపోయిన దానిని తిరిగి దేవుడు కనుగొన్నాడు. అందుచేతనే తిరుసభ ఈ
ఆదివారమును “లేతేరే” లేదా “సంతోషించు” ఆదివారంగా కొనియాడుతుంది.
తప్పిపోయిన
కుమారుని ఉపమానంలో మూడు పాత్రదారులు
వున్నారు. మొదటగా, పెద్ద కుమారుడు. వ్యసనాలకులోనై పశ్చత్తాపం చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముడిని చూచి సంతోషించక
బాధపడిన కుమారుడు. అతను స్వనీతిమంతుడైన పరిసయ్యులను సూచిస్తున్నాడు. పరిసయ్యులు, ఒక పాపి
రక్షించబడటం కంటే తాను నాశనం చేయబడటం చూడటానికే ఎక్కువ ఇష్టపడతారు. అలాగునే తన
తండ్రికి విధేయత చూపినవాడుగానూ, సంవత్సరాల తరపడిన కాలమంతా ప్రేమపూర్వక సేవతో కాకుండా కఠినమైన
విధితో నిండి వున్నట్లుగా అతని వైఖరి చూపిస్తుంది.
అతనికి సానుభూతి లేదు. అతను ఆ తప్పిపోయిన కుమారుడిని 'తన
సోదరుడు'
అని కాకుండా 'నీ కుమారుడు' అని
సంబోధించాడు. సంతోషించక అసూయ నైతికతన దిగజారిపోయినప్పుడు, నిజానికి తనే స్వార్థపరుడు.
చిన్నావాడు కాదు. తన సోదరుడు చేయలేని పాపము “వేశ్య” అనే పదం వాడి ఆ పాపమును తనకు
అంటగట్టాడు. నిందలు వేయడం పరిశుద్ధ గ్రంథ భాషలో మహా చావైన పాపం!
రెండవది, తండ్రి. పాపం వల్ల నాశనమైన కుమారుడు తిరిగి రావడంతో తన
తిరుగు రాక కొరకు వేచి యున్న తండ్రి లేచి ఎదురు వెళ్ళాడు. అది క్రీస్తు ముఖంలో
ప్రతిబింబించే మన పరలోక తండ్రి వైఖరికి చిహ్నం: “అతను ఇంకా చాలా దూరంలో ఉన్నప్పుడు, అతని తండ్రి అతన్ని చూసి కరుణతో నిండిపోయాడు. అతను తన కుమారుని
దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, అతన్ని
కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు” (లూకా 15:20). ఎటువంటి అత్యంత
పాపి అయినా, దేవునికి చాలా
ముఖ్యమైనవాడని, అతన్ని ఏ విధంగానూ
కోల్పోకూడదని యేసు మనకు నేర్పిస్తున్నాడు. తండ్రి దేవుడు వర్ణించలేని ఆనందంతో
ఉన్నాడు. తన కుమారుని ప్రాణాన్ని కూడా లెక్కించకుండా ఎల్లప్పుడూ
క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
మూడవది, చిన్న కుమారుడు. నిజమే.
అతను స్వార్థపరుడే! స్వార్థం అనే మూలం నుండి ఇంద్రియాలకు సంబంధించిన పాపాలు మరియు అధిక
గర్వం పెరుగుతాయి. ఆ స్థితి శాశ్వత అసంతృప్తి, నిష్క్రమణ
మరియు దేవుని నుండి దూరాన్ని పెంచే దీన హీన స్థితి. ఇది ఒక నీచమైన, దాస్య స్థితి. లోకానికి లేదా శరీరానికి దుఃఖంగా మార్చబడిన
ఆత్మ, తన తత్వాన్ని వృధా చేసుకుంటుంది మరియు అల్లరిగా అల్లకొల్లోలంగా
జీవిస్తుంది (ప్రసంగి 9:18). దారి
తప్పిన ప్రయాణికుడిలా తప్పిపోయినటు వంటిది ఈ దుడుకు ఆత్మ. తప్పిపోయిన కుమారుడు తన
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాడు. అతను ఆకలితో అలమటించాడు. "నేను లేచి
నా తండ్రి దగ్గరకు వెళ్తాను" అని చెప్పుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు.
నిజమైన పశ్చత్తాపం అనేది ధైర్యంగా తలెత్తి అణకువతో దేవుని వద్దకు తిరిగి వస్తోంది.
ఇది తనలో కన్పించే పారదర్శక పరివర్తన. పాపాన్ని ఒప్పుకోవడం అంటే శాంతి మరియు
క్షమాపణకు అవసరమైన ఒక షరతు. నిజంగా పశ్చాత్తాపపడేవారు దేవుని ఇల్లు మరియు దాని
ఆధిక్యతలకు అధిక విలువను కలిగి ఉంటారు (కీర్తన 84:
4,10).
ఈ దీక్షా
రోజుల్లో మనం నేర్చుకొనే పాఠం - పాపపు సేవలో నశించడానికి సిద్ధంగా ఉన్నట్లు తాము గ్రహించేవరకు
పాపులు క్రీస్తు సేవకు రాలేరు. పాపము పాపితో మాట్లాడాలి. పాపి దేవుని హస్తాలలో చిక్కబడాలి.
అప్పుడే సంసిద్దత. మనం శరీరానికి రుణగ్రస్తులం కాదు. పాపం నుండి పరివర్తన అంటే
ఆత్మను మరణం నుండి జీవానికి చైతన్య పరచడం మరియు కోల్పోయిన దానిని కనుగొనడం. ఇది
గొప్ప అద్భుతమైన సంతోషకరమైన మార్పు. ఎందుకంటే కోల్పోయినది
కనుగొనబడుతుంది, చనిపోయినది తిరిగి జివింపజేస్తుంది మరియు పనికిరానిది
ప్రయోజనకరంగా మార్చబడుతుంది. మరి నీ పరిస్థితి ఏమిటి? నేడు దేవుని
హస్తాలలో ఉన్నందుకు ఈ నాటి అర్చన సంతోషాన్ని వాక్య సంతోషాన్ని తనివితీరా పొందుకొని
పొరుగువారితో కూడా పంచుకుందాం.
"నీ వాక్యం
నా అడుగులకు దీపం, నా మార్గానికి వెలుగు"